ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు ప్రమాదంలో పడ్డాయి. యాప్‌లో ఉన్న ఒక పెద్ద లోపం (Error) కారణంగా యూజర్ల ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ ఫోటోలు, స్టేటస్ ఇంకా 'About' సెక్షన్ వివరాలు బయటకు లీక్ (Leak) అయ్యే అవకాశం ఉందని వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ ఎర్రర్ ద్వారా స్కామర్లు (Scammers) ఏదైనా ఫోన్ నంబర్ పై వాట్సాప్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. తర్వాత నంబర్‌కు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో, స్టేటస్, 'About' వివరాలను చెడు పనులకు వాడుకునే అవకాశం ఉంది.
ఈ లోపం వాట్సాప్‌లోని 'కాంటాక్ట్ డిస్కవరీ' అనే ఫీచర్‌లో ఉందని పరిశోధకులు చెప్పారు. ఈ ఫీచర్ ద్వారా పెద్ద మొత్తంలో యూజర్ల డేటాను దొంగిలించడానికి ఛాన్స్ ఉంది. పరిశోధనలో తేలింది ఏంటంటే పరిశోధకులు 245 దేశాలకు చెందిన దాదాపు 6300 కోట్ల నంబర్లను టెస్ట్ చేశారు. వీటిలో 350 కోట్ల యాక్టివ్ వాట్సాప్ అకౌంట్స్ ఉన్నట్టు కనిపెట్టారు. 56.7% మంది యూజర్ల ప్రొఫైల్ ఫోటోలు, 29.3% మంది యూజర్ల 'About' వివరాలు బయటపడ్డాయి. ఈ వివరాలలో రాజకీయ అభిప్రాయాలు, మతం లేదా ఇతర సోషల్ మీడియా లింక్‌లు కూడా ఉన్నాయి.
ప్రపంచంలోని మొత్తం 350 కోట్ల అకౌంట్లలో భారతదేశంలోనే అత్యధికంగా 74.9 కోట్ల మంది (సుమారు 21%) యూజర్ల అకౌంట్స్ ప్రమాదంలో ఉన్నాయి. తర్వాత ఇండోనేషియా (23.5 కోట్లు), బ్రెజిల్ (20.6 కోట్లు) తరువాత అమెరికా (13.7 కోట్లు), రష్యా (13.2 కోట్లు) ఉంది. ఈ ప్రమాదంలో ఉన్న డాటాలో 81% మంది ఆండ్రాయిడ్ (Android) యూజర్లు ఉన్నారు.
►ALSO READ | డేటా షేరింగ్‌కు జొమాటో, స్విగ్గీ గ్రీన్ సిగ్నల్.. ! ఫుడ్ ఆర్డర్ చేస్తే మీ ఫోన్ నంబర్ రెస్టారెంట్‌కు తెలుస్తుందా... ?
వాట్సాప్ సంస్థ దీనిపై స్పందిస్తూ, ఈ పరిశోధన మాకు సహాయపడింది. ఇప్పటివరకు ఈ లోపాన్ని ఎవరూ కూడా దుర్వినియోగం చేసినట్లు (Misused) లేదు అని చెప్పింది. డేటా హ్యాకింగ్ ఆపేందుకు వాట్సాప్ ఇప్పుడు కొత్త సెక్యూరిటీ టూల్స్ తయారు చేస్తోంది.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా ఈ లోపం గురించి కొన్ని సలహాలు ఇస్తున్నారు. మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్, 'About' వివరాలను 'Everybody' కి కాకుండా 'My Contacts' లేదా 'Nobody' కి సెట్ చేసుకోండి. అలాగే 'About' సెక్షన్‌లో మీ రాజకీయ అభిప్రాయాలు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను పెట్టకండి అని సూచిస్తున్నారు.
