డేటా షేరింగ్‌కు జొమాటో, స్విగ్గీ గ్రీన్ సిగ్నల్.. ! ఫుడ్ ఆర్డర్ చేస్తే మీ ఫోన్ నంబర్ రెస్టారెంట్‌కు తెలుస్తుందా... ?

డేటా షేరింగ్‌కు జొమాటో, స్విగ్గీ గ్రీన్ సిగ్నల్.. ! ఫుడ్ ఆర్డర్ చేస్తే మీ ఫోన్ నంబర్ రెస్టారెంట్‌కు తెలుస్తుందా... ?

చాలా కాలంగా జరుగుతున్న పోరాటం తర్వాత జొమాటో (Zomato ) ఇప్పుడు రెస్టారెంట్ యజమానులతో కస్టమర్ల ఫోన్ నంబర్‌లను షేర్ చేసుకునేందుకు అంగీకరించింది. దీనివల్ల కస్టమర్‌లకు మరింత మెరుగైన సేవలు ఇవ్వవచ్చని రెస్టారెంట్లు చెబుతున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అనే రెస్టారెంట్ల సంఘం జొమాటో & స్విగ్గీ (Swiggy ) కస్టమర్ డేటాను షేర్ చేసుకోవడం లేదని చాలా కాలంగా ఫిర్యాదు చేస్తోంది.

అలాగే తాము లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ చేయలేకపోతున్నామని, ఏ కస్టమర్ మా  దగ్గర ఎంత ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారో తెలియడం లేదని రెస్టారెంట్లు వాదిస్తున్నాయి.  చాలా పోరాటం తర్వాత Zomato ఇప్పుడు కస్టమర్ ఫోన్ నంబర్‌ను రెస్టారెంట్‌లతో షేర్ చేసుకునేందుకు ఒప్పుకుంది. రెస్టారెంట్ యజమానులు దీనిని మా పరిశ్రమకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

ఎందుకంటే ఆర్డర్‌లో ఏదైనా సమస్య ఉంటే లేదా ఆర్డర్ వివరాల గురించి వెంటనే క్లారిటీ  కావాలంటే రెస్టారెంట్ ఓనర్లు ఇకపై కస్టమర్‌కు నేరుగా కాల్ చేయవచ్చు. ఇంతకుముందు కస్టమర్‌లు రెస్టారెంట్‌లకు కాల్ చేసేవారు, కానీ రెస్టారెంట్లు కస్టమర్‌లకు కాల్ చేయలేకపోయాయి. ఈ నిర్ణయంపై నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు మాత్రం తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. ఇది మా ప్రైవసీని భంగం కలిగించడమే అని, కస్టమర్ డేటాను షేర్ చేసుకోవడం పూర్తిగా ఆపేయాలని   డిమాండ్ చేస్తున్నారు.

ఫోన్ నంబర్ షేరింగ్  అనేది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని, భవిష్యత్తులో ఆర్డర్ చేసిన వస్తువులు, ఆర్డర్ హిస్టరీ వంటి ఇతర డేటా కూడా షేర్ అవుతుందని  ఆందోళన తెలుపుతున్నారు.  సమాచారం ప్రకారం, కస్టమర్ల అంగీకారం తీసుకున్న తర్వాతే వారి డేటా/ఫోన్ నంబర్ రెస్టారెంట్‌లతో షేర్ చేసుకోవచ్చు.  Swiggy కూడా ఇదే విధంగా డేటాను షేర్ చేసుకునేందుకు అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.

దేశవ్యాప్తంగా 5 లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్  Zomato, Swiggy అనుసరిస్తున్న  పద్ధతుల గురించి కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.