- హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చే ప్రణాళికను సభ ముందు ఉంచబోతున్న సర్కారు
- పాలసీపై బీఆర్‌ఎస్ ఆరోపణలకు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరుగనున్నది. గ్రేటర్ హైదరాబాద్ మధ్యలో ఉంటూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఆవల ఉన్న ప్రాంతాలకు తరలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. ఈ చర్చ ద్వారా భవిష్యత్ హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చే పక్కా ప్రణాళికను ప్రభుత్వం సభ ముందు ఉంచబోతున్నది. మరోవైపు, హిల్ట్ పాలసీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రియల్ ఎస్టేట్ దందాకు ప్లాన్ చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టనున్నది. హిల్ట్ పాలసీ ముందే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లీక్ కావడం, ఆయన రూ.5 లక్షల కోట్ల లావాదేవీలు అంటూ చేసిన ఆరోపణలపై సభలో అధికార పార్టీ స్పష్టత ఇవ్వనున్నది. పరిశ్రమల తరలింపు మాత్రమే కాకుండా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల బాగోతాలను కూడా ఎండగట్టేందుకు ఆధారాలతో ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసుకున్నది.
గత సర్కారు ల్యాండ్ కన్వర్షన్ చిట్టా విప్పేందుకు రెడీ..
పరిశ్రమల జోన్ల పేరుతో గతంలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ల చిట్టాను ‘కేస్ బై కేస్’ బయటపెట్టేందుకు రంగం సిద్ధమైంది. నాడు నిబంధనలకు విరుద్ధంగా భూముల మార్పిడి ఎలా జరిగింది? దీని వెనుక చక్రం తిప్పిన పెద్దలు ఎవరు? అనే విషయాలను ప్రభుత్వం ఆధారాలతో సహా సభలో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలు, పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ‘వన్ సైడ్ బ్యాటింగ్’ చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో అధికార పక్షం పైచేయి సాధించింది. అదే ఊపును, హిల్ట్ పాలసీ చర్చలోనూ కొనసాగిస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
