డీజిల్, పెట్రోల్​ బండ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పిరం?

డీజిల్, పెట్రోల్​ బండ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పిరం?

హైదరాబాద్, వెలుగు:డీజిల్, పెట్రోల్​తో నడిచే బండ్లకు త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వాటి రెన్యూవల్ చార్జీలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. పొల్యూషన్ తగ్గించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ధరల పెంపు ఇలా..

డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే వాహనాలతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో అలాంటి సమస్య  ఉండదు. దీంతో కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే డీజిల్​, పెట్రోల్​ బండ్లను తగ్గించి, ఎలక్ట్రికల్​ వాహనాలను ప్రోత్సహించడమే మంచిదని కేంద్రం  భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించింది. 15 ఏండ్లకు పైబడిన డీజిల్, పెట్రోల్​ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం చార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్యాసింజర్ కార్లకు రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ 10,000 కు పెంచనున్నారు. ట్యాక్సీలు అయితే  రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ 1,000 నుంచి సుమారుగా రూ 15,000 కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ట్రక్కుల రెన్యువల్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 2,000 నుంచి రూ. 40,000 కు పెంచే అవకాశాలు ఉన్నాయి. మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏండ్లు ముగిసిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది.