మగాళ్లలా వేషం మార్చి దొంగతనాలు.. దొరికిపోయిన ఇద్దరు అమ్మాయిలు.. చూడండి ఎలా చేస్తున్నారో..!

మగాళ్లలా వేషం మార్చి దొంగతనాలు.. దొరికిపోయిన ఇద్దరు అమ్మాయిలు.. చూడండి ఎలా చేస్తున్నారో..!

బెంగళూరు నగరంలో దొంగతనాలు చేసేందుకు కొందరు కిలేడీలు అడ్డదారులు తొక్కుతున్నారు. పట్టుబడకుండా ఉండేందుకు సినిమా లెవెల్ లో మగాళ్ల మాదిరిగా వేషధారణ మార్చి మరీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువతులు మగవారిలా వేషం వేసి.. ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులను తప్పుదోవ పట్టిందేందుకే కిలాడీ లేడీలు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

జనవరి 13న బెంగళూరులో నివసించే ఒక ఆటో డ్రైవర్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత షాలు, నీలు అనే ఇద్దరు యువతులు ఆ ఆటో డ్రైవర్ ఇంటిని టార్గెట్ చేశారని పోలీసులు గుర్తించారు. అయితే నిఘా కెమెరాల్లో చూసినా తాము దొరకకూడదని, మహిళలమని ఎవరూ గుర్తించకూడదని భావించి వారు మగవారిలా బట్టలు వేసుకుని మారువేషంలో ఆ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి చొరబడి అందినకాడికి దోచుకున్నారు.

Also Read : హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా

ఆటో డ్రైవర్ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో మగవారిలా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే వారి వేషధారణ పోలీసులను కాసేపు తికమక పెట్టినా.. వారు ఉపయోగించిన టూ వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్ దొంగలను ఇచ్చే పట్టించింది. ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. చివరకు వేషాలు మార్చి దొంగతనం చేసింది ఇద్దరు మహిళలను తేల్చేశారు పోలీసులు. 

ప్రస్తుతం ఆ ఇద్దరు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేవలం ఈ ఒక్క చోట మాత్రమే కాకుండా.. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మారువేషాల్లో దొంగతనాలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త దొంగతనాల ట్రెండ్ చూసిన పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతి ఇంటికి సీసీటీవీ సర్వేలెన్స్ ఎంత అవసరమో మరోసారి నిరూపిస్తోంది.