
- లోకల్ బాడీ ఎలక్షన్స్ లేటు కావడంతో అనర్హులకు ఊరట
- గత ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని ప్రజాప్రతినిధులపై 2021లో అనర్హత వేటు
- ఆ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి1తో మగింపు..
- 2024 ఏప్రిల్ వరకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై నిషేధం
- కలిసిసొచ్చిన లోకల్ బాడీ ఎన్నికల ఆలస్యం..
- మళ్లీ పోటీచేసేందుకు సిద్ధమవుతున్న లీడర్లు
భద్రాచలం, వెలుగు : లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం కావడంతో గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధులు గట్టెక్కారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అర్హత సాధించడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత ఎన్నికల నిర్వహణ తర్వాత సరైన సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని ప్రజాప్రతినిధులపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ మూడేండ్లపాటు అనర్హత వేటు వేసింది. 2021 నవంబరులో ఈ ఉత్తర్వులు వచ్చాయి. వారిపై 2024 ఏప్రిల్ వరకు ఈ నిషేధం కొనసాగింది.
కాగా తర్వాత వచ్చే ఎన్నికలు ఆలస్యం కావడంతో ఇప్పుడు తిరిగి పోటీ చేసేందుకు లభించింది. 2019 జనవరిలో జిల్లాలోని 479 గ్రామపంచాయతీలకు, 4,232 వార్డులకు ఎలక్షన్స్ జరిగాయి. ఆ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. ఇదే క్రమంలో లోక్‌సభకు ఎన్నికలు రావడంతో సర్కారు లోకల్‌బాడీ ఎలక్షన్స్ నిర్వహించలేదు. స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగియగా, పరిషత్‌లో కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది.
ఇదీ పరిస్థితి..
నూతన పంచాయతీరాజ్ చట్టం -2018 ప్రకారం 2019 సంవత్సరం జనవరిలో గ్రామపంచాయతీ, మే నెలలో పరిషత్ ఎలక్షన్స్ జరిగాయి. జిల్లాలో 479 పంచాయతీలకు, 21 జడ్పీటీసీలకు, 219 ఎంపీటీసీలకు ఎలక్షన్స్ జరిగాయి. క్యాండిటేట్స్ ఎలక్షన్స్ పూర్తయ్యాక 45 రోజుల్లో ప్రచారానికి చేసిన ఖర్చుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు ఆయా ఎంపీడీఓ ఆఫీసుల ద్వారా సమర్పించాలి. ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీ చేసే క్యాండిడేట్స్ వార్డు మెంబర్ రూ.30వేలు, సర్పంచ్ క్యాండిడేట్ రూ.1.50లక్షలు, ఆపై జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డ్ మెంబర్ రూ.50వేలు, సర్పంచ్ క్యాండిడేట్ రూ.2.50లక్షలు ప్రచారానికి ఖర్చు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం గెలిచిన, ఓడిన క్యాండిడేట్స్ ఖర్చుల వివరాలు తెలియజేయాలి.
ఇందులో గెలిచిన వార్డుమెంబర్స్ కొందరు ఆ వివరాలు వెల్లడించలేదు. ఓడిన వారిలో కొందరు నిబంధనలు అతిక్రమించారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ అనేక దఫాలుగా నోటీసులు ఇచ్చింది. కానీ ఎలాంటి స్పందన లేదు .దీనితో ఎంపీడీవోల రిపోర్టు ఆధారంగా గెలిచిన 96, ఓడిన 196 మందిపై 2021 నవంబరులో ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ వరకు వీరు ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదని ఆదేశించింది.
ఇప్పుడు పోటీకి సై..
అనర్హత వేటు పడిన వారంతా ఇప్పుడు గడువు ముగియడంతో పోటీకి సై అంటున్నారు. సకాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగి ఉంటే వీరు పోటీకి దిగేవారు కాదు. ఆలస్యం తమకు అమృతంగా మారిందనే ఆనందంలో ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారైతే త్వరలోనే లోకల్‌బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో వేటు పడిన వారికి ఉపశమనం లభించడం విశేషం.