ఇద్దరు పిల్లలను అమ్మకానికి పెట్టిన తండ్రి

ఇద్దరు పిల్లలను అమ్మకానికి పెట్టిన తండ్రి
  •     మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి 
  •     ఆర్థిక భారంతో అమ్మకానికి పెట్టాగా  అడ్డుకున్న అధికారులు 

దుబ్బాక, వెలుగు : మతిస్థిమితం కోల్పోయిన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పిల్లలను పోషించలేనని తండ్రి ఇద్దరు పిల్లలను విక్రయించడానికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్​ సిద్ధి భారతి భూపతి, ఐసీడీఎస్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పానేటి రేణుక, పోచయ్య దంపతులకు గౌతమ్​(3), తరుణ్​(18 నెలలు) కుమారులు ఉన్నారు. మతిస్థిమితం కోల్పోయిన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోగా తండ్రి పోచయ్య అనారోగ్యానికి గురయ్యాడు. చిన్నారులను పోషించలేక ఇద్దరు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్​ అధికారుల బృందం గ్రామంలో విచారణ చేపట్టింది.

తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్నారులను వైద్య పరీక్షల కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పజెప్పాలని అధికారులు సూచించారు. చిన్నారులను అమ్మినా, కొన్నా మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడ్డుకున్న వారిలో బాలల సంరక్షణ విభాగం అధికారి రాజు, శిశుగృహ సామాజిక కార్యకర్త రాజారామ్, డీసీపీయూ కార్యకర్త అనితారాణి, కౌన్సిలర్​నర్సింలు, అంగన్​వాడీ టీచర్స్​, ఆశా వర్కర్లు ఉన్నారు.