నిర్మల్ జిల్లాలో పూర్తి కాని చేప పిల్లల పంపిణీ

నిర్మల్ జిల్లాలో పూర్తి కాని చేప పిల్లల పంపిణీ

నిర్మల్,వెలుగు:నిర్మల్ జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఈనెలాఖరుకల్లా ప్రాజెక్టులు, చెరువుల్లో పిల్లలు వదలాల్సి ఉండగా  ఇప్పటి వరకు కనీసం 20 శాతం పిల్లలనే వదిలారు. దీంతో ఉపాధి ఎట్ల అంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ ​జిల్లాలో మొత్తం 701 చెరువుల్లో 4.90 కోట్ల చేప పిల్లలు వదలాలని ఆఫీసర్లు నిర్ణయించారు. వర్షాకాలం ముగిసి నెల దాటింది. కానీ.. ఆఫీసర్లు కేవలం 1.28 కోట్ల పిల్లలను మాత్రమే జలవనరుల్లో వదిలారు. అయితే అవి నాణ్యత లేవని మత్స్యకార సంఘం సభ్యులు ఆరోపించారు. జిల్లాకు మొత్తం ఆరు ఫిష్ సీడ్ పామ్ లు చేప పిల్లలు అందించేందుకు టెండర్లు దక్కించుకున్నాయి. ఏటా జులై నుంచి నవంబర్ చివరి వరకు పిల్లలు పంపిణీ చేయాలి. అయితే సీడ్ పామ్ నిర్వాహకులు నాణ్యత లేని పిల్లలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు సరఫరా నిలిపివేశారు. సీడ్ పామ్​లో పిల్లలు పరిశీలించేందుకు కమిటీని నియమించారు. అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో సభ్యులు టెండర్లు దక్కించుకున్న ఫిష్ సీడ్ పామ్ లను సందర్శించి చేప పిల్లల నాణ్యత పరిశీలించనున్నారు. కమిటీ పిల్లల క్వాలిటీని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సరఫరా కానున్నాయి. నాణ్యంగా లేకపోతే తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఈసారి సీజన్​లో  చేప పిల్లల పంపిణీ కష్టమే.

మరో 20 రోజులే గడువు...

చేప పిల్లలు పెరగడానికి జులై నుంచి నవంబర్ నెల ఎంతో అనుకూలమని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. జిల్లాలోని 701 చెరువుల్లో ఇప్పటివరకు కేవలం కొన్ని చెరువుల్లో 1.28 కోట్ల పిల్లలు మాత్రమే వదిలారు. మరో 20 రోజులలోగా సీడ్ పామ్​ల నుంచి జిల్లాకు పిల్లలు సరఫరా కావాలి.  సీడ్ పామ్​లను తనిఖీ చేసేందుకు నియమించిన కమిటీ ప్రక్రియ వేగవంతం చేయాలి. లేదంటే జలవనరుల్లో పిల్లలు వదలడం కష్టమే. ఒకవేళ వది పిల్లల ఎదగుదలపై ప్రభావం పడనుంది.

నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తాం... 

జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లల విడుదల ప్రక్రియ ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. పరిపాలనపరమైన ఇబ్బందుల కారణంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యమైంది. పామ్​ల తనిఖీ కోసం నియమించిన కమిటీ నివేదిక త్వరలో రానుంది. తర్వాత సీడ్ సరఫరా చేస్తాం.
- నర్సింహరావు, డీఎఫ్​డీవో, నిర్మల్