సాగర్ బైపోల్‌తో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ.. ఆంధ్రా కంపెనీకి కాంట్రాక్ట్

సాగర్ బైపోల్‌తో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ.. ఆంధ్రా కంపెనీకి కాంట్రాక్ట్

నల్గొండలో నేటి నుంచి గొర్రెల పంపిణీ

ఆ జిల్లాలో మాత్రమే పంపిణీకి ఏర్పాట్లు

254 యూనిట్లనే పంచనున్నట్టు సర్కారు ఉత్తర్వులు

నాగార్జునసాగర్‌లోని గొల్లకురుమల ఓట్ల కోసమేనని విమర్శలు

ఓపెన్‌ టెండర్లు లేకుండా ఆంధ్రా కాంట్రాక్టర్‌కు అప్పగింత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ మళ్లీ మొదలు పెడ్తామని మూడేళ్ల తర్వాత సర్కారు ప్రకటించింది. కానీ ఒక్క నల్గొండ జిల్లా వరకే ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి పైగా గొర్రెల కోసం వెయిట్‌ చేస్తుంటే 254 యూనిట్లనే పంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక ఉన్నందున అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న గొల్లకురుమలను ఆకట్టుకోవడానికి సర్కారు శనివారం నుంచి పంపిణీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్క జిల్లా వరకేనా?

రాష్ట్రంలో 3.63 లక్షల మంది గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 28 వేల మంది గొల్లకురుమలు బంగారం, పుస్తెలు కుదువ పెట్టి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి లబ్ధి దారుల వాటాగా రూ.31,250 చొప్పున డీడీలు కట్టారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ 2018 ఫిబ్రవరిలో నిలిచి పోయింది. తర్వాత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా పంపిణీపై ప్రకటన చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 125 యూనిట్ల వరకు ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ ఆపేసింది. తాజాగా గొర్రెలిస్తామని మళ్లీ ప్రకటించింది. నల్గొండ టౌన్‌లోని బత్తాయి మార్కెట్‌లో శనివారం నుంచి పంపిణీకి రెడీ అయింది. కానీ ఆ పంపిణీ ఆ ఒక్క జిల్లా వరకే పరిమితం చేసింది. ఆ జిల్లా వరకే ఏర్పాట్లు చేసి కేవలం  254 యూనిట్లే పంచనున్నట్టు ఉత్తర్వులిచ్చింది. కేవలం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 40 వేల వరకు జనాభా ఉన్న గొల్లకురుమల ఓట్ల కోసమే పంపిణీ చేపడుతోందనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

11న దరఖాస్తు.. 12న అనుమతి

నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీని ఆంధ్రా కాంట్రాక్టర్‌కు కేటాయించారు. ఎలాంటి ఓపెన్ టెండర్లు నిర్వహించకుండా దరఖాస్తు చేసుకున్న శ్రీ కామధేను పెన్మత్స ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. అది కూడా ఈ నెల 11న దరఖాస్తు చేసుకుంటే 12న అనుమతిచ్చారు. 16న పంపిణీ షురూ చేస్తున్నారు. ఇదంతా చకచకా జరిగినట్టు తెలిసింది.

నగదు బదిలీ చేయాలి

గొర్రెల పథకంలో నగదు బదిలీ చేయాలని గొర్రెల కాపర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గొల్లకురుమల కంటే మధ్య దళారులు, పశువుల డాక్టర్లే 20 శాతం వరకు కమీషన్‌తో బాగుపడుతున్నారని, నాసిరకం గొర్రెలతో తమకు ప్రయోజనం ఉండట్లేదని వాళ్లు చెబుతున్నారు. నగదు బదిలీ చేస్తే మధ్య దళారుల్లేకుండా మంచి గొర్రెలు కొనే అవకాశం ఉంటుందన్నారు.

యూనిట్‌కు అయ్యే ఖర్చు
యూనిట్‌కు రూ. 1.25 లక్షలు
లబ్ధిదారు వాటా రూ. 31,250
ప్రభుత్వ సబ్సిడీ రూ. 93,750

గొర్రెల పంపిణీ వివరాలు
మొత్తం పథకం టార్గెట్ – 7లక్షల 29 వేల 67 యూనిట్లు
పంపిణీ చేసింది – 3 లక్షల 65 వేల 682 యూనిట్లు
ఇంకా పంచాల్సింది – 3 లక్షల 63 వేల 385 యూనిట్

For More News..

ఆంధ్రా ఆగట్లే.. సంగమేశ్వరం కింద కొత్తగా 9 రిజర్వాయర్లు

అఖిలప్రియ తమ్ముడిపై కేసు.. ఎఫ్ఐఆర్‌‌లో చేర్చిన పోలీసులు

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌