- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు: డిప్యూటీ సీఎం భట్టి
మధిర, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మున్సిపాలిటీల్లో తిరిగి ఆ పార్టీ గెలిస్తే పేదలు నష్టపోతారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మధిరలో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వస్తే మళ్లీ సన్నబియ్యం పోయి పేదలకు దొడ్డుబియ్యం ఇస్తారని, ఉద్యోగులకు 15 తారీకు తర్వాతే జీతాలు వస్తాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలు కావాలంటే, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రణాళికలు చేపడుతున్నారని అన్నారు.
మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారన్నారు. బీఆర్ఎస్హయాంలో ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యేవని, తాము మొదటి తారీకునే జీతాలు జమ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు రూ.1కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, ఈ కార్యక్రమాలు కొనసాగాలంటే ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి నడవాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంకుల నిర్వహణ, కుటీర పరిశ్రమల కోసం రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. వచ్చే 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మధిర పట్టణ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామన్నారు.
