
రూ.31 వేల చొప్పున డీడీలు తీసి రెండేండ్లు
అప్పులు చేసి మరీ డబ్బులు పేచేసిన గొల్ల, కురుమలు
రూ.కోటి 16 లక్షలకు వడ్డీలు కూడా లాస్
రెండో విడత యూనిట్లుఇచ్చేది ఇంకెప్పుడు..?
ఖమ్మం, వెలుగు: జిల్లాలో గొల్ల, కురమలకు గొర్రెల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రెండు విడతల్లో అందరికీ గొర్రెల యూనిట్లను అందిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. తొలి విడతలో ఎంపికైన 15 వేల మందికి మాత్రం అందించింది. ఇంకా దాదాపు 1,300 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో 371 మంది లబ్ధిదారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి డీడీలు కూడా చెల్లించారు. ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున మొత్తం దాదాపు కోటి 16 లక్షల రూపాయలను డీడీల రూపంలో ఇచ్చారు. వాళ్లకి ఇప్పటికీ గొర్రెల యూనిట్లు రాకపోవడంతో సోమవారం ఖమ్మం జిల్లాకేంద్రంలోని పశు సంవర్థక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డీడీలు కట్టిన వారికి ముందుగా యూనిట్లు పంపిణీ చేసి, రెండో విడత గొర్రెల పంపిణీ కూడా పూర్తి చేయాలని కోరారు.
2017లో స్కీం ప్రారంభం
రాష్ట్రంలో గొల్లకురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని 2017 జూన్ 21న పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అర్హులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక గొర్రె పోతును ఒక యూనిట్‌గా పంపిణీ చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సొసైటీల్లో సభ్యులుగా చేరిన వారందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను సైతం గుర్తించారు. వారిలో సగం మందిని తొలి దశలో లాటరీ పద్ధతిలో సెలక్ట్ చేశారు. ఎంపిక చేసిన ప్రతీ సభ్యుడి నుంచి రూ.31,250 వాటాధనంగా డీడీ రూపంలో వసూలు చేసి.. 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున కొనుగోలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో లబ్ధిదారులు చెల్లించిన వాటాధనం పోగా ఒక్కొక్కరికి రూ.93,750 సబ్సిడీ వర్తిస్తుంది.
332 సొసైటీలు.. 33 వేల మంది మెంబర్స్
జిల్లాలో 332 సొసైటీలు ఉండగా.. వీటిలో 33 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరి కోసం రూ.400 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో 16,324 మందిని ఎంపిక చేయగా, వారిలో 15,357 మందికి మాత్రమే జీవాలను అందించారు. ఇంకా 967 మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. వీళ్లందరూ దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మొదటి విడత పంపిణీ పూర్తయిన నుంచి మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం తాము డీడీల ద్వారా చెల్లించిన డబ్బులైనా వస్తాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు.
అప్పు చేసి డీడీ కట్టిన
చాలా రోజులుగా గొర్రెల కోసం ఎదురు చూస్తున్నం. వెంటనే గొర్రెలు ఇస్తారని డీడీ కట్టమంటే కట్టిన. అప్పుడు చేతిలో డబ్బులు లేకున్నా తెలిసిన వారి దగ్గర రూ.31 వేలు అప్పు చేసి డీడీ తీసినం. అయినా ఇంత వరకు గొర్రెలు పంపిణీ చేయలేదు. అధికారులు మా గురించి పట్టించుకుంటలేరు. – మర్రి రామాంజనేయులు, అల్లీనగరం
ఆందోళనలకు రెడీ
చాలా మంది అప్పు చేసి డీడీలు కట్టారు. గొర్రెలు, మేకల కోసం ఎదురుచూస్తు న్నారు. గతేడాదే ఇచ్చి ఉంటే ఇప్పటివరకు అవి ఎదిగి ఉండేవి. డీడీల కోసం తెచ్చిన అప్పుకు ఓ వైపు వడ్డీలు పెరుగుతున్నాయి. మొదటి విడతలో గొర్రెలు రాని లబ్ధి దారులకు, రెండో విడత లబ్ధి దారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలి. లేదంటే ఆందోళన చేస్తాం.
– మేకల నాగేశ్వరరావు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి