- బ్లాక్ స్పాట్స్ దగ్గర రంబుల్ స్ట్రిప్ లు, సైన్ బోర్డుల ఏర్పాటు
- ఆర్అండ్బీ, ఎన్హెచ్, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో చర్యలు
- గుంతలు, బైపాస్ రోడ్డుపై లారీలు నిలపడంతో ప్రమాదాలు
ఖమ్మం, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికారులు సీరియస్ గా నజర్ పెట్టారు. ప్రమాదాలు జరగకుండా చూడడంతో పాటు, బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాహనదారులను అలర్ట్ చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో గుంతలు పడిన రోడ్లను రిపేర్ చేసి.. గ్లో సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్ లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఖమ్మం సిటీలో మెయిన్ రోడ్ల వెంట ఫుట్ పాత్ ల ఏర్పాటు, ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు, పనిచేయని సీసీ కెమెరాల పునరుద్ధరణపై దృష్టిపెట్టారు.
జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద బ్యారికేడింగ్, సూచిక బోర్డులు, స్టాపర్స్, సిగ్నల్ లైట్స్, బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని రోడ్ సేఫ్టీ కమిటీలో ఆర్ అండ్ బీ, మున్సిపల్, రెవెన్యూ, ఎన్హెచ్, పోలీస్ అధికారులు భాగస్వామ్యులుగా ఉన్నారు. ఇటీవల ఆయా శాఖలతో జరిగిన సమీక్షా సమావేశంలో నెల రోజుల్లో రోడ్ సేఫ్టీకి సంబంధించి పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
డ్యామేజీ రోడ్లతో ప్రమాదాలు..!
జిల్లాలో మొత్తం 43 బ్లాక్ స్పాట్ లను ఆఫీసర్లు గుర్తించారు. వీటిలో ఎన్హెచ్ఏఐ పరిధిలో నాలుగు, జాతీయ రహదారుల్లో 33, ఇతర రోడ్లపై 6 ఉన్నాయి. ఇటీవల వర్షాలతో పాటు మొంథా తుఫాను కారణంగా రోడ్లు చాలా వరకు డ్యామేజీ అయ్యాయి. జిల్లాలో దాదాపు 126 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్టు ఆఫీసర్లు గుర్తించారు. వీటి మరమ్మతులకు రూ.15 కోట్లో కావాలని అంచనా వేశారు. వీటితో పాటు పట్టణాల్లో ప్రధాన రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలను నివారించాలంటే ఈ గుంతలను పూడ్చాలని ఆఫీసర్లు చెప్తున్నారు. మొంథా తుఫానుకు ముందు 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పట్టణాల్లోని గుంతలను పూడ్చారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రోడ్లపై 470 గుంతలను గుర్తించి, ఆరు ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టి వాటి పూడ్చివేత పనులు చేపట్టారు. కోల్డ్ మిక్స్ సాంకేతికతతో తాత్కాలికంగా రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేశారు. కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ కోసం ప్లాస్టిక్ బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. బైపాస్ రోడ్డుపై రాత్రి వేళల్లో ఏదులాపురంలో రోడ్డుకు ఇరువైపులా లారీలను పార్కింగ్ చేయడం, ఏదైనా రిపేర్ వస్తే కేవలం చెట్టు కొమ్మలను గుర్తుగా పెట్టి లారీని రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సేఫ్టీ చర్యలు ఇలా..
ఖమ్మంకు బైపాస్ గా ఉన్న నేషనల్ హైవే 365బిబి పై మరమ్మతులు రంబుల్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్, స్పీడ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లో స్కూళ్ల దగ్గర రోడ్లపై స్కూల్ జోన్, గో స్లో బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రానైట్ లారీలు, ఇతర భారీ వాహనాల వల్ల జిల్లాలో 18 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించి.. మొదటి దశలో 5 రోడ్ల మరమ్మత్తు చేపట్టారు. ఖమ్మం కార్పొరేషన్ లో 16 కిలోమీటర్లు ప్రధాన రోడ్లలో నేషనల్ హైవే తరహాలో లైన్ మార్కింగ్, జిబ్రా క్రాసింగ్ వేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాం. వివిధ శాఖల సమన్వయంతో ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు ఆక్సిడెంట్ డిటెక్షన్ సెంటర్) వంటివి పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రధాన జంక్షన్ ల వద్ద రోడ్లపై గో స్లో వైట్ పేయింట్, రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లపై లైన్ మార్కింగ్ ఉండేలా చూస్తున్నాం. బ్లాక్ స్పాట్ ల దగ్గర గో స్లో వైట్ పేయింట్ వేస్తున్నాం. ఇక ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో ఆస్పత్రికి తరలించేలా హైవేల సమీపంలో ఉన్న పీహేచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లను బలోపేతం చేస్తున్నాం. - అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్
