పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలి: శరత్

పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలి: శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగడానికి పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు  లౌడ్ స్పీకర్లు,  సభలు,  సమావేశాలు , ర్యాలీలకు, వాహనాలకు ముందస్తు అనుమతి పొందాలన్నారు.

 అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేకంగా  బ్యాంక్ అకౌంటును ఓపెన్ చేయాలని, నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారికి వివరాలు అందించాలని పేర్కొన్నారు. అభ్యర్థి ప్రతిరోజు 10 వేల నగదుకు మించి చెల్లింపు చేయరాదని, ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద ప్రచారం చేయకూడదని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు మాధురి,  చంద్రశేఖర్, డీఆర్​ఓ నగేశ్, రిటర్నింగ్ అధికారులు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫస్ట్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి 

రాజకీయ పార్టీల ప్రతినిధులు , రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది సమక్షంలో పూర్తి ఆన్లైన్ విధానం ద్వారా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్,  వీవీప్యాట్స్ ల కేటాయింపు పూర్తయిందని కలెక్టర్​ శరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం) బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.