సర్కార్ జీవో ఇచ్చినా.. చెక్ పోస్టులు ఎత్తేయలే..! : కలెక్టర్ల ఫిర్యాదులు

సర్కార్ జీవో ఇచ్చినా.. చెక్ పోస్టులు ఎత్తేయలే..! : కలెక్టర్ల ఫిర్యాదులు
  • రవాణా శాఖపై ప్రభుత్వానికి పలు జిల్లాల కలెక్టర్ల ఫిర్యాదులు 
  • అంతర్ రాష్ట్ర వాహన డ్రైవర్లకు కౌన్సెలింగ్ కోసమేనంటూ ఆర్టీఏ వివరణ 
  • మరోసారి వివాదాస్పదంగా రవాణా అధికారుల తీరు 
  • దసరా, దీపావళి నేపథ్యంలో మామూళ్ల కోసమేనంటూ విమర్శలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ప్రధాన రహదారులపై అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందటే జీవోను విడుదల చేసినా.. రవాణా శాఖ అధికారులు మాత్రం వాటిని ఇంకా కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవేలపై చెక్ పోస్టులతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని ఎత్తేయాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆదేశించింది. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నందున రవాణా శాఖ ప్రతిష్ట సైతం మసకబారుతోందని భావించిన తెలంగాణ ప్రభుత్వం కూడా చెక్ పోస్టుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకుంది. 

గత జులైలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ జీవోను కూడా రిలీజ్ చేసింది. అయితే, రెండు నెలలు దాటినా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీఏ అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా15 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 70 మంది ఆర్టీఏ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, చెక్ పోస్టుల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అడ్వాన్స్డ్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రవాణా అధికారులు సిద్ధమయ్యారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని ఆయా జిల్లాల్లో ఖాళీ పోస్టుల్లో నియమించాలని నిర్ణయించారు. 

హైవేలపై ఇతర రాష్ట్ర వాహనాలు నిబంధనలను ఉల్లంఘించకుండా చూసేందుకు 109 మంది ఏఎంవీఐలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వీరికి శాఖాపరమైన శిక్షణ కూడా పూర్తయింది. అయినా, చెక్ పోస్టులను మాత్రం ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు. దసరా, దీపావళి సందర్భంగా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ సరకుల వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే చెక్ పోస్టులను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

సర్కారుకు కలెక్టర్ల లేఖలు.. 

చెక్ పోస్టులు కొనసాగించడంపై పలు జిల్లాల్లో వాహనదారులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వారు ఆయా జిల్లాల్లోని ఆర్టీఏ, డీటీసీ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో, ఒకేసారి చెక్ పోస్టులు ఎత్తేస్తే ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చే సరుకు వాహనాల డ్రైవర్లకు కొత్త పద్ధతులు అర్థంకాక ఆందోళనకు గురవుతారనే వీటిని కొనసాగిస్తూ.. ముందుగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. 

అంతర్ రాష్ట్ర వాహన యజమానులకు, డ్రైవర్లకు రెండు నెలల పాటు చెక్ పోస్టులు ఎత్తివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేసే తీరును వివరిస్తూ కౌన్సెలింగ్ ఇస్తామని, ఆ తర్వాత ఎత్తేస్తామని తెలిపినట్టు తెలిసింది. ఈ వివరణపై సంతృప్తి చెందని కొందరు కలెక్టర్లు.. నిబంధనలకు విరుద్ధంగా చెక్ పోస్టులు కొనసాగిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్టు సమాచారం.