ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి : శరత్

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి : శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు : ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ఎస్పీ రూపేశ్​తో కలిసి రిటర్నింగ్,  పోలీస్ అధికారులతో  పలు అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఎన్నికల విధుల పట్ల పూర్తి  అవగాహన కలిగి ఉండాలన్నారు.  

ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన  స్టాటస్టిక్ సర్వేలెన్సు , ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్  బృందాలు, వీడియో వీవింగ్  బృందాలు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా  కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రింటింగ్  ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 "ఎ" సెక్షన్ ప్రకారం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించేటప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్లు స్పష్టంగా ముద్రించాలని తెలిపారు.

 నిబంధనలను  ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు సీవిజిల్​ యాప్ ద్వారా ఫొటో, లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు దారు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.  సీ విజిల్​లో నమోదైన ఫిర్యాదులపై  100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ , అడిషనల్ ఎస్పీ అశోక్,  డీఆర్వో నగేశ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.