
- పేర్ల నమోదు నుంచి డెలివరీ వరకు వీరిదే బాధ్యత
- మాతా, శిశు మరణాలపై ఆడిట్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు
- స్పెషల్ యాక్షన్‌ప్లాన్ చేపట్టిన వైద్యారోగ్య శాఖ
- రాష్ట్రంలో ప్రతి లక్ష ప్రసవాలకు 81 మరణాలు
- 2030 నాటికి 70 మరణాలకు తగ్గించడమే టార్గెట్
హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖానల్లో తల్లీబిడ్డల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రెగ్నెంట్లను హాస్పిటల్లో చేర్చుకోవడం దగ్గర నుంచి వారికి సురక్షితంగా డెలివరీ పూర్తయ్యేవరకూ.. అన్ని సేవలూ సక్రమంగా అందేలా చూసేందుకు ప్రత్యేకంగా ఒక మెటర్నల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్ఓ)ను నియమించాలని యోచిస్తోంది. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ నుంచి బిడ్డ ప్రసవించే వరకూ అన్నింటికీ ఇకపై ఈ ఆఫీసరే బాధ్యత వహించనున్నారు. మాతా, శిశు సంరక్షణపై ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ, ఇందులో భాగంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒక ఎంహెచ్ఓ ఉన్నారు. ఇకపై జిల్లాకో ఆఫీసర్ ఉండనున్నారు. అత్యాధునిక వసతులు ఉన్నా దేశవ్యాప్తంగా ప్రతి లక్ష ప్రసవాల్లో 77 మంది తల్లులు, తెలంగాణలో ప్రతి లక్ష ప్రసవాల్లో 81 మంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదేండ్లలోపు శిశు మరణాలు కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 34 మంది ఐదేండ్లు నిండకుండానే చనిపోతున్నారు. ప్రతి 100 మందిలో 8 మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన స్పెషల్యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లాకో మెటర్నల్ హెల్త్ ఆఫీసర్‌ను నియమించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.
తొలి 48 గంటలు డేంజర్ పీరియడ్
పురిటినొప్పులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రసవం తర్వాత 48 గంటల వరకూ గర్భిణులకు డేంజర్ పీరియడ్‌గా పరిగణిస్తారు. మెటర్నల్ డెత్స్‌లో సగానికిపైగా ఈ సమయంలోనే జరుగుతాయి. బీపీ, షుగర్, ఎనీమియా, హైపర్ టెన్షన్, బిడ్డ అడ్డం తిరగడం, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు మరణాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం నార్మల్ డెలివరీ అంటే, అటు గర్భిణులతోపాటు, యువ డాక్టర్లు కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పురిటి నొప్పులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రసవం వరకూ ఎలా నడుచుకోవాలో నేర్పుతున్నారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులకు తప్పనిసరిగా మాతా, శిశు కేంద్రాల్లోనే డెలివరీలు చేయించాలని నిర్ణయించారు. వీళ్లను కొంత ముందుగానే ఆస్పత్రికి చేర్చాలని భావిస్తున్నారు. తెలంగాణలో 92% డెలివరీలే ఆస్పత్రుల్లో(ఇనిస్టిట్యూషనల్) జరుగుతున్నాయని ఇటీవలి నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ పేర్కొంది. ఏజెన్సీ ఏరియాల్లో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆస్పత్రికి చేరకముందే ప్రసవాలు జరుగుతుండడంతో తల్లి, బిడ్డకు ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇనిస్టిట్యూషనల్ డెలివరీల శాతాన్ని పెంచాల్సిన బాధ్యతను కూడా మెటర్నల్హెల్త్ఆఫీసర్లకే అప్పగించారు.
మరణాలపై ఆడిట్
మాతా, శిశు మరణాలపై ప్రత్యేక అధికారులతో వైద్యారోగ్యశాఖ ఆడిట్ చేయిస్తోంది. మరణం సంభవించిన రెండ్రోజుల్లో, ఏఎన్‌సీ రిజిస్ర్టేషన్ నుంచి మరణం వరకూ ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు ఈ అధికారులు నివేదించాల్సి ఉంటుంది. దీంతో మరణాలకు గల కారణాలతోపాటు ఎక్కడ లోపం ఉందో గుర్తించి, ఎవరి నిర్లక్ష్యమైనా ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన యూనివర్సల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో మాతా, శిశు మరణాల తగ్గింపు కూడా ఉంది. 2030 నాటికి ప్రతి లక్ష ప్రసవాల్లో 70 కంటే తక్కువ మరణాలు ఉండాలన్నది ఎస్‌డీజీ గోల్. ప్రస్తుం తీసుకుంటున్న చర్యలతో ఒకట్రెండు ఏండ్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.