IND vs AUS: టీమిండియాదే సిరీస్.. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ రద్దు

IND vs AUS: టీమిండియాదే సిరీస్.. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ రద్దు

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో కేవలం 4.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదో టీ20 రద్దు కావడంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా టూర్ ను  టీమిండియా ముగించుకుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తమ తదుపరి సిరీస్ ను టీమిండియా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది.    

గిల్, అభిషేక్ పవర్ ప్లే లో మెరుపులు:

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి రింకూ సింగ్ ని ప్లేయింగ్ 11లోకి తీసుకొని వచ్చారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. మొదటి ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. డ్వార్షుయిస్ వేసిన మూడో ఓవర్లో గిల్ నాలుగు ఫోర్లు కొట్టి 16 పరుగులు రాబట్టాడు. వికెట్ నష్టపోకుండా 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసిన భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. అయితే భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను ఆపేశారు. వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. గిల్ 16 బంతుల్లో 29 పరుగులు.. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

ALSO READ : దుమ్ములేపుతున్న జురెల్..

ఈ సిరీస్ విషయానికి వస్తే ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించి 1-1 తో సమం చేసింది. గురువారం (నవంబర్ 6) జరిగిన నాలుగో టీ20లో ఇండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. శనివారం (నవంబర్ 8) ప్రారంభమైన చివరిదైన ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది.