టీఆర్ఎస్​లో మళ్లీ  జిల్లా అధ్యక్ష పోస్టులు

V6 Velugu Posted on Aug 28, 2021

  • ఈటల ఎపిసోడ్ ​తర్వాత హైకమాండ్​ తీరులో మార్పు
  • కొత్త జిల్లాలు వచ్చాక ఎమ్మెల్యేలకే ఫుల్ ​పవర్స్​
  • పార్టీలో కొన్నాళ్లుగా పెరిగిన లుకలుకలు.. అసంతృప్తులు 
  • కొత్త అధ్యక్షుల నియామకానికి  కేటీఆర్​ గ్రీన్​ సిగ్నల్​
  • రెడీ అవుతున్న ఉద్యమకారులు, జంప్‍ జిలానీలు

సెప్టెంబర్‍ 2న ఢిల్లీలో టీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీస్‍ నిర్మాణానికి సీఎం కేసీఆర్‍ శంకుస్థాపన చేస్తారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‍ వార్డుల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తాం. అనంతరం జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం. దసరాకు జిల్లాల్లోని పార్టీ ఆఫీసులను కేసీఆర్‍ ప్రారంభిస్తారు. అక్టోబర్‍లో పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. అక్టోబర్‍ లేదంటే నవంబర్‍లో పార్టీ 20వ వార్షికోత్సవ మీటింగ్‍ ఉంటది.’ 
– ఈ నెల 24న టీఆర్‍ఎస్‍ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍

వరంగల్‍, వెలుగు: ఈటల ఎపిసోడ్​ తర్వాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు దీటుగా పార్టీ లీడర్లను డెవలప్​చేయాలని భావిస్తున్న  టీఆర్ఎస్​ హైకమాండ్​మళ్లీ జిల్లా అధ్యక్ష పదవులను తెరపైకి తెస్తోంది. తద్వారా ఎమ్మెల్యేల కంట్రోల్​లో ఉన్న క్యాడర్​ను పూర్తిగా పార్టీ కంట్రోల్​లోకి తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉంది. అదే సమయంలో నామినేటెడ్​పోస్టుల కోసం ఏళ్లుగా తహతహలాడుతున్న లీడర్లను సంతృప్తి పరచాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ కాలంలో అటు పార్టీని, ఇటు ఉద్యమాన్ని నడిపించిన జిల్లా అధ్యక్ష పదవులను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది.  జిల్లాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అంటూ ఇంతకాలం చెబుతూ వచ్చిన పార్టీ హైకమాండ్​.. కొత్త జిల్లాల ఏర్పాటు కన్నా ముందు నుంచే పార్టీ జిల్లా ప్రెసిడెంట్​పదవులను పక్కన పెట్టేసింది. కానీ ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్​లో టీఆర్ఎస్​లీడర్లు, క్యాడర్​ను తనవైపు తిప్పుకునేందుకు నానాతంటాలు పడిన హైకమాండ్.. పోటీ కోసం అభ్యర్థిని కూడా వెతుక్కోవాల్సి రావడంతో పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే దసరా నాటికి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ ఆఫీస్‍లను ఓపెన్‍ చేయాలని, 20 ఏండ్ల ఆవిర్భావ వేడుకలు నిర్వహించేలోగా జిల్లా అధ్యక్ష పోస్టులను భర్తీ చేయాలని టీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్​ నిర్ణయించారు. దీంతో ఈ పోస్టుల కోసం ఉద్యమంలో కేసీఆర్‍ వెంట నడిచినవారితో పాటు వివిధ పార్టీల నుంచి జంప్‍ అయినవారు సైతం రెడీ అవుతున్నారు.
నాడు పార్టీలో జిల్లాల అధ్యక్షులే సుప్రీం
టీఆర్‍ఎస్‍ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్లే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్​అన్ని జిల్లాలకు  అధ్యక్షులను నియమించి, వారి సాయంతో లీడర్లను, క్యాడర్​ను నడిపించింది. పార్టీలో ఎంతటి సీనియర్లున్నా.. ప్రెసిడెంట్‍ ఆధ్వర్యంలో ముందుకు సాగేలా పవర్స్​కట్టబెట్టింది. ఓ విధంగా గులాబీ పార్టీ జనాల్లోకి వెళ్లడంలో పార్టీ ప్రెసిడెంట్లు కీలకపాత్ర పోషించారు. అటు ఉద్యమంలో, నాటి ఎన్నికల్లో గులాబీ​పార్టీని జిల్లా అధ్యక్షులే ముందుండి నడిపించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‍ఎస్‍ అధికారంలోకి వచ్చాక కొంతకాలం పాతవారినే అధ్యక్షులుగా కొనసాగించారు. తర్వాత క్రమంగా వారి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత  జిల్లా అధ్యక్షులు, ఇతరత్రా కమిటీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. 
ఉద్యమకారులకు మళ్లీ పోటీ తప్పట్లే..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించి.. కమిటీలు వేస్తామని పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ ప్రకటించి నాలుగు రోజులైందో లేదో అప్పుడే జిల్లా కేడర్‍లో హీట్‍ మొదలైంది. నాడు ఉద్యమంలో కేసీఆర్‍ వెంట నడిచినవారు అధ్యక్ష పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‍ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల్లోంచి జంప్‍ అయినవారు ఉద్యమకారులకు పోటీగా రెడీ అవుతున్నారు. తాము ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తుంటే..  పదవులు ఇచ్చే క్రమంలో షార్ట్​కట్‍ రూట్​లో వచ్చినవారికి పార్టీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారనే బాధ ఇప్పటికే చాలామందిలో గూడుకట్టుకుంది. ఇది నిజమన్నట్లుగా పలు  జిల్లాల్లో కార్పొరేషన్‍ మేయర్లు, మున్సిపల్‍ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు..చివరికి  కౌన్సిలర్‍ పోస్టుల్లోనూ ఉద్యమకారులకు అవమానమే ఎదురైంది. దీంతో వచ్చే నెలలో హైకమాండ్‍ సెలక్ట్ చేసే జిల్లా అధ్యక్షుల లిస్ట్ పై అటు పార్టీలో, ఇటు పబ్లిక్​లో ఆసక్తి నెలకొంది.
పార్టీలో లుకలుకలు.. అసంతృప్తులు
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం టీఆర్​ఎస్​హైకమాండ్​ కేవలం రాష్ట్ర కమిటీ నియామకానికే పరిమితమైంది.  జిల్లాలకు అధ్యక్షులను ఇవ్వకుండా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎమ్మెల్యేలకు ఫుల్‍ పవర్స్ ఇచ్చింది. దీంతో జిల్లాతో సంబంధం లేకుండా ఎవరి నియోజకవర్గాలకు వారు సుప్రీంలా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీలోనే ఒకరి ఇలాకాలో మరొకరు అడుగు పెడితే శత్రువులుగా చూస్తున్నారు. కాగా కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు సీనియర్లు ఉండడంతో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గంలోని కేడర్‍ కొంత యాక్టివ్‍ ఉంటున్నా.. మిగతావారికి ఎలాంటి పదవులు లేకపోవడంతో వారివెంట నడిచే సీనియర్‍ ,సెకండ్‍ కేటగిరీ లీడర్లు, కార్యకర్తలు అసంతృప్తితో ఉంటున్నారు. అందరినీ కోఆర్డినేట్‍ చేయడానికి గతంలో మాదిరి జిల్లా అధ్యక్షులు లేకపోవడంతో పార్టీలో లుకలుకలు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు జెట్‍ స్పీడ్‍తో మారుతున్న నేపథ్యంలో గులాబీ కేడర్‍ ఇతర పార్టీల దిక్కు చూస్తోంది. దీనికితోడు ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్లకు సైతం ఎలాంటి పదవులు లేకపోవడంతో వారిలో కొందరు ఎప్పుడు గోడ దూకుతారో తెలియకుండా ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్​ హైకమాండ్‍ ఇన్నేండ్ల తర్వాత మళ్లీ జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కమిటీలు వేయాలని డిసైడ్‍ అయింది.

Tagged TRS, posts, President, District,

Latest Videos

Subscribe Now

More News