సొంత పార్టీ నేతల అవిశ్వాసం.. మున్సిపాలిటీల్లో మారుతున్న రాజకీయం

సొంత పార్టీ నేతల అవిశ్వాసం.. మున్సిపాలిటీల్లో మారుతున్న రాజకీయం

హైదరాబాద్, వెలుగు: సిటీ శివారు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​ లోకి వెళ్లారు. వీటిలో 7 కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు ఉన్నాయి.  నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో మూడు, నాలుగు చోట్ల మినహా అన్నిచోట్ల అధికార బీఆర్ఎస్​ పార్టీనే గెలుచుకుంది. కొన్నిచోట్ల సభ్యులు తక్కువగా గెలుపొందినా ఎక్స్ అఫీషియో మెంబర్లతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. కాగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే కొన్ని చోట్ల సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు నడుస్తున్నది. ఎన్నికలకు ముందుగానే అవిశ్వాస తీర్మానాలను బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పెట్టారు. కేటీఆర్, హరీశ్​రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ​అధికారం కోల్పోవడమే కాకుండా మేయర్లు, చైర్మన్లకు సభ్యుల మధ్య విబేధాలు ముదరగా.. మళ్లీ అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి.

 ఇప్పటికే ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు. ఆయా చోట్ల బీఆర్ఎస్​కు చెందిన మేయర్, చైర్మన్లే ఉన్నారు. ఇదే బాటలో ఇంకొన్ని చోట్ల కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా అవిశ్వాసం పెట్టడంలో బీఆర్ఎస్​ నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టే  చాన్స్ ఇప్పటికే మూడుచోట్ల అవిశ్వాస తీర్మానం పెట్టాలని నోటీసులు కలెక్టరేట్​లో అందజేశారు. మరిన్ని మున్సిపాలిటీల్లో ఎప్పుడైనా ఇచ్చే చాన్స్ ఉంది. రెండు, మూడు కార్పొరేషన్లతో పాటు 10కిపైగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు  పెట్టే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మంతనాలు కూడా చేసినట్లు  తెలుస్తోంది. 

అధికార పార్టీ వైపు వెళితే అభివృద్ధికి అడ్డంకులు ఉండవని చూపుతూ అవిశ్వాసం వైపు వెళుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్​లో ఉంటూనే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. ముందుగా ఇప్పుడున్న వారిని పదవిలో నుంచి తప్పించిన తర్వాత పార్టీలు మారే అంశంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. మేయర్, చైర్మన్ రేసులో ఉన్నవారు ప్రభుత్వం మారిన వెంటనే  గ్రౌండ్ లెవెల్​లో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఏడాది పదవీ కాలం ఉండటంతో ఎలాగైనా  ఈ ఏడాది పాటు పదవిని తాము  సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. మొత్తానికి కొద్దిరోజుల్లోనే వరుస పెట్టి అవిశ్వాస తీర్మానాల నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నార్సింగి, దమ్మాయిగూడ, జవహర్ నగర్, ఘట్ కేసర్, ఫిర్జాదిగూడ తదితర చోట్ల చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సంక్రాంతి తరువాత ఏ క్షణమైనా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. 

ఎంపీ ఎన్నికల నాటికి అంతా పూర్తి.. 

ఈ నెల 26తో  శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఇందులో చాలా వాటిలో అవిశ్వాస తీర్మానానికి గతంలోనే నోటీసులు ఇచ్చారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో చాలా మంది ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండగా అంతకు ముందుగానే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వెళ్లొచ్చు. రాష్ట్రంలో అత్యధిక  ఎంపీ సీట్ల గెలుపు వ్యూహాల ప్లాన్ కాంగ్రెస్ చేస్తున్నది. అందులో భాగంగానే మున్సిపాలిటీలపై కూడా పార్లమెంట్ స్థాయి నేతలు ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే స్థానిక నేతలతో మంతనాలు కూడా జరుగుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లోపు చాలా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మేయర్లు, చైర్మన్లు దిగిపోనున్నారు.​