అవ్వతాతలకు ఆసరా దివ్యాంగులకు ధీమా.. కిశోర బాలికలకు భరోసా

అవ్వతాతలకు ఆసరా దివ్యాంగులకు ధీమా.. కిశోర బాలికలకు భరోసా
  • అండగా నిలవనున్న సెర్ప్
  • మహిళా సంఘాల తరహాలో ఆ వర్గాల వారికి ప్రత్యేక సంఘాలు 
  • బాలికలకు పొదుపు పాఠాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ

హైదరాబాద్, వెలుగు: సమాజంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వర్గాలకు అండగా నిలిచేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల తరహాలోనే వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 

ఆర్థికంగా, సామాజికంగా ఆ వర్గాల వారిని బలోపేతం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఈ వర్గాలకు సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారత, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఎస్ హెచ్ జీల తరహాలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సంఘాలతో దివ్యాంగులకు పొదుపును అలవాటు చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలు అందించి రుణ సదుపాయం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు10,162 గ్రూపులను ఏర్పాటు చేసింది. 

దివ్యాంగులు ఉన్న ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం గుర్తించిన దివ్యాంగులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్​ చేయిస్తున్నది. కొత్త సంఘాలను ఆన్​లైన్​ చేస్తున్నారు. శారీరక వైకల్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేశారు. 

వీరికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, స్వయం ఉపాధి పొందేలా రుణాలు ఇప్పించడం, తోటి వారిలో ధైర్యాన్ని నింపడం ఈ గ్రూపుల ప్రధాన ఉద్దేశం. తాము ఎవరిపై ఆధారపడకుండా బతకగలమనే నమ్మకాన్ని ఈ సంఘాలు కల్పిస్తున్నాయి. కాగా, సంఘంలో ఐదు నుంచి 15 మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు. 

అవ్వాతాతలకు అండగా..

మహిళా సంఘాల తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేయడం ద్వారా ఒకరికొకరు తోడుగా నిలిచేలా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల కోసం 6,053 ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులు ఒకచోట చేరడం, తమ కష్టసుఖాలను పంచుకోవడం ద్వారా వారికి మానసిక ఊరట లభిస్తోంది. ప్రస్తుత సమాజంలో చాలా మంది వృద్ధులు కుటుంబాల నిరాదరణకు గురై, లేదా పిల్లలు దూరంగా ఉండడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 

ఈ సంఘాల ద్వారా ఒకే ఊరిలో లేదా ప్రాంతంలో ఉండే వృద్ధులు ఒకచోట కలుస్తారు. తమ కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. దీనివల్ల తాము ఒంటరి వాళ్లం కాదనే భావన కలుగుతుంది. అంతేకాదు, ఈ సంఘాలు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా నిలుస్తాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

బాలికల్లో నాయకత్వ లక్షణాలు..

రాష్ట్రంలోని కిశోర బాలికల (15 నుంచి 18 ఏండ్ల వయసు) కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘స్నేహ సంఘాలు’ ఏర్పాటు చేసింది.  మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళా స్వయంస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హా య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క సంఘాల మాదిరిగా నే ఇవి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 19.13 లక్షల మంది కిశోర బాలికలు ఉండగా.. ఇప్పటివరకు 8,356 కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసింది. 

చిన్న తనం నుంచే బాలికల్లో పొదుపు అలవా టు పెంచడం, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించడం ఈ గ్రూపుల లక్ష్యం. అంతేకాకుండా వారిలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బాల్య వివాహాల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యావకాశాలపై ఈ సంఘా ల్లో చర్చిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. 

ఆరోగ్యంపై అవగాహన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణ, అనీమి యా తగ్గింపు, పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్  భద్రత, ఆన్​లైన్​ దుర్వినియోగాల నివారణ, స్కిల్  ట్రైనింగ్, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై స్నేహ సంఘాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.