- మహిళలకు 33శాతం సీట్లు ఏమయ్యాయ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టికెట్లు మహిళలకు ఎందుకు కేటాయించలేదని తన నాన్న కేసీఆర్ను అడిగే ధైర్యం ఎమ్మెల్సీ కవితకు లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష చేశారని మండిపడ్డారు. లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత అప్పుడు దీక్ష చేశారని ధ్వజమెత్తారు. మహిళా బిల్లును చించేసిన పార్టీలతో కవిత కలిసిపోయిందన్నారు. కేసీఆర్కు తన బిడ్డ తప్ప ఇంకా ఎవరూ కనిపించరని విమర్శించారు. కీలకమైన ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను మహిళలకు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా నామినేట్ చేస్తే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున మహిళలపై దాడులు జరుగుతున్నా.. సీఎం క్యాంప్ ఆఫీసులో పనిచేసే ఏ అధికారి కూడా నోరు మెదపడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందన్నారు. సీఎం కాళ్లు మొక్కుతూ ఐఏఎస్ పోస్టుకు ఉన్న గౌరవం తీసేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా.. అది బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వాలని అధికారులు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై వేల కోట్లు విలువ చేసే భూములు బీఆర్ఎస్ లీడర్లు కొట్టేస్తున్నారని విమర్శించారు. మద్యం టెండర్ల మీద ఉన్న శ్రద్ధ.. విద్యా రంగంపై లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన చాలా మంది అభ్యర్థులపై అవినీతి ఆరోపణలున్నాయని విమర్శించారు. గవర్నమెంట్ డబ్బులతో ఓట్లు కొనేందుకు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయన్నారు.