
- అడ్వొకేట్ల మీటింగులో డీకే శివకుమార్ ఫన్నీ కామెంట్
బెంగళూరు: కుర్చీని ఉద్దేశించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఫన్నీ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే కూర్చునే చాన్స్ వదులుకోవద్దని.. దానిపై కూర్చుని గట్టిగా పట్టుకోవాలని తెలిపారు. కెంపెగౌడ జయంతి సందర్భంగా బెంగళూరులో శుక్రవారం బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అడ్వొకేట్ల సమావేశానికి డీకే శివకుమార్ చీఫ్ గెస్టుగా అటెండ్ అయ్యారు. అక్కడ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నా అడ్వొకేట్లు వాటిపై కూర్చోకపోవడాన్ని గమనించిన డీకే శివకుమార్ సరదాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."కుర్చీ సంపాదించడం చాలా కష్టం. ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అడ్వొకేట్లంతా వచ్చి కూర్చోండి.
జీవితంలో కుర్చీ దొరకడం అంత సులభం కాదు. ఒకవేళ కుర్చీ దొరికితే కూర్చునే అవకాశాన్ని వదులుకోవద్దు. దానిపై కూర్చుని గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడున్న అడ్వొకేట్లలో చాలామంది త్యాగశీలురులుగా కనిపిస్తున్నారు. మీ కోసం గొప్ప కుర్చీలతో ఇంత మంచి భవనం నిర్మించారు. మీకు కూర్చునే చాన్స్ వచ్చింది. దాన్ని ఉపయోగించుకోండి. కుర్చీలున్నా మీరు కూర్చోవడం లేదు. కానీ, మా వంటి రాజకీయ నాయకులు మాత్రం ఒక కుర్చీ కోసం పోరాటమే చేస్తున్నాం" అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆయన చేసిన సరదా కామెంట్లకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. కర్నాటక సీఎంను మారుస్తారని జరుగుతున్న ప్రచారం వేళ శివకుమార్ కుర్చీ గురించి చేసిన సరదా
కామెంట్లు చర్చనీయాంశంగామారాయి.