రూ.200 కోట్ల ప్రాపర్టీ స్కామ్.. లేని ఫ్లాట్ రూ.12 కోట్లకు అమ్మిన కేటుగాళ్లు.. ఎలాగంటే..?

రూ.200 కోట్ల ప్రాపర్టీ స్కామ్.. లేని ఫ్లాట్ రూ.12 కోట్లకు అమ్మిన కేటుగాళ్లు.. ఎలాగంటే..?

ఈరోజుల్లో మోసగాళ్లు ప్రజల అవసరాలను ఆసరాగా మార్చుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా దేశ రాజధానికి అత్యంత చేరువలో జరిగిన మెగా మోసం వెలుగులోకి రావటంతో రియల్టీ ప్రాపర్టీలు కొనేవారిలో ఆందోళనలు పెరుగుతున్నాయి. 

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న గురుగ్రామ్‌లోని 'డీఎల్ఎఫ్ కమెల్లియాస్' (DLF Camellias) అపార్ట్‌మెంట్‌ పేరుతో జరిగిన ఒక భారీ రియల్ ఎస్టేట్ మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు లేని ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను బ్యాంకు వేలంలో దక్కించుకున్నట్లు నమ్మించి, నకిలీ డాక్యుమెంట్లతో ఏకంగా రూ.12 కోట్లకు విక్రయించిన మోసాన్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా దాదాపు రూ.200 కోట్లకు పైగా భారీ స్కామ్ వెనుక ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు.

ప్రధాన సూత్రధారి మోహిత్ గోగియా, తన ముఠాతో కలిసి పక్కాగా వ్యూహం రచించేవాడు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే లగ్జరీ ప్రాపర్టీలు ఇప్పిస్తామంటూ జనాన్ని ఆకర్షించేవారు. బ్యాంకు వేలం ద్వారా ఈ ఆస్తులను తాము కొనుగోలు చేశామని నమ్మించేలా ఫోర్జరీ చేసిన సేల్ సర్టిఫికెట్లు, కవరింగ్ లెటర్లు, ఇతర డాక్యుమెంట్లను చూపించేవారు. ఈ డాక్యుమెంట్స్ ఎంత అసలు వాటిలా ఉండేవంటే.. సామాన్యులే కాదు అనుభవం ఉన్నవారు కూడా సులభంగా మోసపోయే పరిస్థితి ఉండేది. తాజాగా బాధితుడి నుంచి రూ.12 కోట్లు వసూలు చేసిన తర్వాత.. అతను ప్రాపర్టీ డిటైల్స్ గురించి తెలుసుకునేందుకు బ్యాంకును సంప్రదించడంతో నిజం బయటపడింది. అసలు అలాంటి వేలమే జరగలేదని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మోహిత్ గోగియా 'బాబాజీ ఫైనాన్స్' అనే సంస్థ ద్వారా బాధితుల నుంచి వచ్చిన సొమ్మును వివిధ షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించేవాడని తేలింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ముంబై నుంచి ఉత్తరాఖండ్ పారిపోతుండగా రిషికేశ్-డెహ్రాడూన్ రహదారిపై గోగియాను అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ ముఠా కేవలం గురుగ్రామ్‌లోనే కాకుండా ఢిల్లీలోని అంబియెన్స్ మాల్ సమీపంలోని విలువైన ప్రాపర్టీలను చూపి చాలా మందిని మోసం చేసినట్లు గుర్తించారు అధికారులు.

ప్రస్తుతం ఈ కేసులో గోగియాతో పాటు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన విశాల్ మల్హోత్రా, సచిన్ గులాటి.. డాక్యుమెంట్స్ ఫోర్జరీలో సహకరించిన భరత్ ఛబ్రా వంటి మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామ్ సింగ్ అలియాస్ బాబాజీ కోసం గాలిస్తున్నారు. తక్కువ రేటుకే ఖరీదైన ప్రాపర్టీ కొనుక్కోవచ్చని ఆశతో బ్యాంకు వేలం డాక్యుమెంట్లను గుడ్డిగా నమ్మవద్దని, ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు సంబంధిత బ్యాంకు లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్వయంగా చెక్ చేసుకోవాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.