హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు తప్పనిసరిగా ఏడాదిపాటు ప్రభుత్వ సేవలందించాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టం చేసింది. ఈ మేరకు కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్, లీవ్స్, పెనాల్టీలకు సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ ను గురువారం విడుదల చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. పీజీ పూర్తయిన డాక్టర్లు తమకు కేటాయించిన చోట 12 నెలలపాటు బాండ్ సర్వీస్ పూర్తి చేయాలి. ఈ కాలంలో వీక్లీ ఆఫ్, పోస్ట్ డ్యూటీ ఆఫ్ కాకుండా.. ఏడాది మొత్తం మీద 20 రోజులు మాత్రమే క్యాజువల్ లీవ్స్ వాడుకోవాలి. గర్భధారణ, ప్రసూతి సంబంధిత కారణాలే తప్ప, ఇతర ఏ కారణాలతోనూ దీర్ఘకాలిక సెలవులకు వీల్లేదని డీఎంఈ పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు
బాండ్ నిబంధనలు ఉల్లంఘించి విధుల్లో చేరకపోయినా, నిర్ణీత కాలం పాటు పని చేయకుండా మధ్యలో మానేసినా పీజీ డాక్టర్లకు రూ.20 లక్షలు, పీజీ డిప్లొమా డాక్టర్లకు రూ.15 లక్షలు ఫైన్వేస్తారు. రూల్స్ బ్రేక్ చేసిన వారి వివరాలను సేకరించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, హాస్పిటల్ సూపరింటెండెంట్లను డీఎంఈ ఆదేశించింది. కేవలం జరిమానానే కాకుండా.. బాండ్ సర్వీస్ పూర్తి చేయని వారిపై కెరీర్ పరంగానూ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
రూల్స్ పాటించని డాక్టర్లు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. అలాగే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో తదుపరి చదువులు చదవడానికి వీలుండదు. అన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని డీఎంఈ స్పష్టం చేసింది.
