కరోనాపై అప్రమత్తంగా ఉండండి:డీఎంఈ

కరోనాపై అప్రమత్తంగా ఉండండి:డీఎంఈ
  •     వైరస్ లక్షణాలుంటే టెస్టు చేయాలని ఆదేశం
  •     కరోనా తాజా పరిస్థితులపై సూపరింటెండెంట్లతో రివ్యూ

హైదరాబాద్/మెహిదీపట్నం/వరంగల్ సిటీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి సూచించారు. హైదరాబాద్​లోని తన ఆఫీస్ లో సూపరింటెండెంట్లతో కలిసి తాజా పరిస్థితులపై శుక్రవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో వచ్చే వారి కోసం స్పెషల్ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వాళ్లంతా ఆ కౌంటర్ల వద్దకే వెళ్లేలా హాస్పిటల్ గేటు, ఓపీ బిల్డింగుల వద్ద మైక్ ద్వారా అనౌన్స్ చేయాలని సూచించారు. కరోనా లక్షణాలతో బాధపడేవారికి వెంటనే టెస్టులు చేయాలన్నారు. పాజిటివ్ వస్తే.. ఐసోలేషన్​లో ఉంచి ట్రీట్​మెంట్ చేయాలని సూచించారు. ప్రతి హాస్పిటల్​లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శనివారం మరోసారి ఈ అంశంపై రివ్యూ చేస్తానన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మరో తొమ్మిది కేసులు నమోదు

రాష్ట్రంలో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. ఇందులో 8 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మరో కేసు రంగారెడ్డి జిల్లాలో రికార్డయినట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,245 మందికి టెస్టులు చేస్తే.. తొమ్మిది మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని తెలిపింది. రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. 

ఎంజీఎంలో ఇద్దరికి పాజిటివ్

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​లో ఇద్దరు రోగులు కరోనా బారినపడ్డారు. గురువారం హాస్పిటల్​లో ఏడు టెస్టులు చేయగా.. భూపాలపల్లికి చెందిన యాదమ్మతో పాటు రాజేందర్ కు పాజిటివ్ వచ్చింది. యాదమ్మ ఎంజీఎం హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నది. రాజేందర్​కు మాత్రం మెడిసిన్స్ ఇచ్చి హోం ఐసోలేషన్​లో ఉండాలని డాక్టర్లు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని ఎంజీఎం సూపరిటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. హాస్పిటల్ ఆవరణలో 50 పడకలతో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశామన్నారు.

నిలోఫర్​లో రెండు, 14 నెలల చిన్నారులకు పాజిటివ్ 

నాంపల్లి ఆగాపుర ఏరియాకు చెందిన 14 నెలల బాబు కరోనా బారినపడ్డాడు. నాలుగు రోజుల కింద తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్న బాబు ను వెంటిలేటర్​పై నిలోఫర్ హాస్పిటల్​కు తీసుకొచ్చారు. డాక్టర్లు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో బాబును ఐసోలేషన్ వార్డుకు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నామని, హెల్త్ కండీషన్ స్టేబుల్​గానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. నిలోఫర్ హాస్పిటల్​లో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. శుక్రవారం చేసిన కరోనా టెస్ట్​లో రెండు నెలల చిన్నారికి కూడా వైరస్ సోకినట్లు గుర్తించామన్నారు.