చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న రూ.1,000 నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.2,000కి పెంచుతామని హామీ ఇచ్చారు.
గృహిణుల కోసం 'ఇల్లతు అరసి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, రూ.8,000 విలువైన కూపన్ల ద్వారా గృహోపకరణాలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. విద్యార్థుల కోసం సుమారు 35 లక్షల ఉచిత ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయడంతోపాటు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఉచిత అల్పాహార పథకాన్ని ఎనిమిదో తరగతి వరకు విస్తరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఐదేండ్లలో 50 లక్షల ఉద్యోగాల సృష్టి, విద్యా ప్రోత్సాహకాలను రూ.1,500కి పెంచుతామని హామీ ఇచ్చింది. రైతులకు 20 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు, క్వింటాల్ వరికి రూ.3,500, టన్ను చెరుకుకు రూ.4,500 మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది.
వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.2 వేలకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.2,500కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం 10 లక్షల పక్కా ఇండ్ల నిర్మాణం, ఆరోగ్య బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామనే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
