పాక్‎ను ఖండించే ఒక్క దోస్తు మోడీకి లేరా..? సభలో చర్చ జరుగుతుంటే విదేశాలకు పోతారా: కనిమొళి

పాక్‎ను ఖండించే ఒక్క దోస్తు మోడీకి లేరా..? సభలో చర్చ జరుగుతుంటే విదేశాలకు పోతారా: కనిమొళి

న్యూఢిల్లీ: మోడీ సర్కార్‎పై డీఎంకే ఎంపీ కనిమొళి ఫైర్ అయ్యారు. మంగళవారం (జూలై 29) లోక్ సభలో ఆపరేషన్ సిందూర్‎పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలొస్తేనే మోడీకి తమిళ కల్చర్‎పై ప్రేమ పుడుతుందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే సభకు వచ్చేందుకు ప్రధాని మోడీకి సమయం ఉండదు.. కానీ విదేశీ పర్యటనలకు మాత్రం వెళ్లడానికి టైమ్ ఉంటుందని విమర్శించారు. విశ్వగురుగా డప్పు కొట్టుకునే మోడీకి.. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాక్‎ను నేరుగా ఖండించే ఒక్క దోస్తు లేరా అని ప్రశ్నించారు. 

దేశంలో ఉగ్రదాడులను అరికట్టకుండా విశ్వగురు మోడీ భారత దేశల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక విషయాల్లో ప్రతిపక్షాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన  విదేశీ ప్రతినిధి బృందాలకు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఏమైనా సమాచారం అందించారా అని నిలదీశారు. 

బీజేపీ విభజనకు రాజకీయాలకు తామేప్పుడు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ ఉగ్రవాద దాడుల నుండి విశ్వగురువు మోడీ ఏమి నేర్చుకున్నారని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దని ఆశించడం కరెక్ట్ కాదని.. మేం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత సమస్యలను పక్కదారి పటిస్తోందని దుయ్యబట్టారు. 

గత తప్పుల నుండి నేర్చుకోవడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకు పొడిగింపులపై ఎక్కువగా ఆధారపడుతోందని.. ఇది ఎక్స్‌టెన్షన్ గవర్నమెంట్ అని అభవర్ణించారు. సీనియర్ బ్యూరోక్రాట్లు చాల మంది ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారని.. రా చీఫ్ ఎక్స్‌టెన్షనే, సీబీఐ డైరెక్టర్ ఎక్స్‌టెన్షనే, ఈడీ చీఫ్ ఎక్స్‌టెన్షనే ఇలా కీలకమైన అన్ని విభాగాలను ఎక్స్ టెన్షన్ అధికారులతోనే నడిపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్  అధికారులపై నమ్మకం లేదా అని నిలదీశారు.