
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు, అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై కేసు నమోదు చేసింది.
ALSO READ | దావోస్ పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వ అతిపెద్ద విజయం: సీఎం రేవంత్ రెడ్డి
దీంతో పంజాగుట్ట పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో (జనవరి 28) విచారణ జరిగింది. పూర్తి వివరాలతో పోలీసుల తరుఫున వచ్చే నెల 5వ తేదీన వాదనలు వినిపిస్తామని పీపీ కోర్టుకు తెలియజేశారు. పీపీ అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 5వ తేదీకి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అయితే.. కేసు తదుపరి విచారణ వరకు హరీష్ రావుపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.