సిబిల్ స్కోర్‌‌ను పరిగణనలోకి తీసుకోవద్దు..అర్హులందరికి రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి: ఆర్.కృష్ణయ్య

సిబిల్ స్కోర్‌‌ను పరిగణనలోకి తీసుకోవద్దు..అర్హులందరికి రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేసేందుకు సిబిల్ స్కోర్‌‌ను పరిగణనలోకి తీసుకోకూడదని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అర్హులైన యువత, నిరుద్యోగులందరికి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ ఉద్యమ నేతలు నీల వెంకటేశ్, రాజు నేత ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాల సమావేశం జరిగింది. 

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘‘రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలపై నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది. సిబిల్ స్కోర్ పేరిట వారి ఆశలను అడియాసలు చేయవద్దు. పైరవీల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు రుణాలు మంజూరు చేయాలి. లబ్ధిదారుల ఎంపికలో, లోన్స్ ప్రాసెస్ చేయడంలో బ్యాంకుల జోక్యం లేకుండా చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందువల్ల ఎటువంటి షరతులు లేకుండా రుణాలు అందించాలి.  

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. కాంగ్రెస్ సర్కారైనా దరఖాస్తు చేసుకున్న వారందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం వెంటనే రూ.15 వేల కోట్లు కేటాయించాలి” అని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు రాజేందర్, అనంతయ్య, చెరుకు మణికంఠ, ముత్యం వెంకన్నగౌడ్, పగిళ్ల సతీశ్, మధుసూదన్ ఆశిశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.