
- ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్నరు
- పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపిన్రు
- మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ
- రోహింగ్యాలపై ఆ పార్టీ వైఖరేంటి
- పాస్‌పోర్టులు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని వెల్లడి
కొత్తపల్లి, వెలుగు: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తుపాకులను చేతపట్టి ఎందరో అమాయకులను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని, ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను చంపేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభను మిగిల్చారని, అలాంటి వారితో చర్చలు ఉండబోవని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలు మావోయిస్టు పార్టీని నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని.. పలువురు నాయకులను మందుపాతరలు పెట్టి మావోయిస్టులు చంపేశారని తెలిపారు.
తుపాకులు వీడనంతవరకూ మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపబోమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీపడుతున్నాయని మండిపడ్డారు. పాస్ పోర్టులు లేని విదేశీ పౌరులను గుర్తించి వారిని తిప్పి పంపిస్తున్నామని సంజయ్తెలిపారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం కుల గణన నిర్ణయం హర్షనీయం
కేంద్ర కులగణన నిర్ణయం హర్షనీయమని, ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరమని అన్నారు. కులగణన విషయంలో మోదీ చేపట్టే సర్వేకు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిన సర్వేకు ఏ మాత్రం పోలిక ఉండబోదని తెలిపారు. కాంగ్రెస్ కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. కులగణలో బీసీల జనాభాను తగ్గించి చూపారని, కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు సంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక అందజేసినా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రజలు గల్లా ఎగరేసుకునేలా మోదీ చర్యలుంటయ్
పహల్గాం ఘటనతో దేశ ప్రజలంతా ఆవేశంతో రగిలిపోతున్నారని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రజలందరూ గల్లా ఎగరేసుకునేలా మోదీ సర్కారు చర్యలు తీసుకోబోతున్నదని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని రేకుర్తిలో హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఒక దేశంతో యుద్ధం చేయాలంటే అనేక పర్యవసానాలు ఎదురవుతాయని, అన్నీ బేరీజు వేసుకున్నాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ అదే పనిలో ఉన్నారని తెలిపారు.