మీరు పత్తిత్తులైతే చాలు.. ఓ కంపెనీలో ఉద్యోగం.. అదేంటీ అంటారా?

 మీరు పత్తిత్తులైతే చాలు.. ఓ కంపెనీలో ఉద్యోగం.. అదేంటీ అంటారా?

ఆ కంపెనీలో ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్స్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. మీ టాలెంట్ కంటే.. మీలోని క్వాలిటీస్ ముఖ్యం. అవును మీరు విన్నది నిజమే. సిగరెట్ తాగకూడదు.. మద్యం సేవించకూడదు.. ముక్క ముట్టకూడదు. ఈ అలవాట్లు ఉంటే ఉద్యోగం ఇవ్వరు. ఒక వేళ ఇచ్చినా.. ఆ తర్వాత వీటిని మొదలుపెట్టినా ఉద్యోగం నుండి పీకేస్తారు. ఇదెక్కడి వింత అంటారా! డ్రాగన్ దేశంలో. 

ఓ చైనా కంపెనీ వెజిటేరియన్స్‌కు మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్నట్లు.. వెజిటేరియన్స్‌కు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వబడును అని ప్రకటన చేసింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే రాముడు మంచి బాలుడు లెక్క. రాముడి లెక్క ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. ఇంటర్వ్యూలోనే వీటి గురుంచి క్లుప్తంగా వివరిస్తారు. కాదన్నవో ఇంకో కంపెనీ చూస్కో అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు.

రూ. 57వేల జీతం.. ఉచిత వసతి..

ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..షెంజెన్ ఆధారిత ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఈ ప్రకటన చేసిందట. జీతంగా 5,000 యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 57,000), అలాగే ఉచిత వసతి కల్పిస్తారు. ఉద్యోగార్థులు ధూమపానం చేయకూడదని, మద్యం సేవించకూడదని, మాంసం తినకూడదని ఉద్యోగ ప్రకటనలో ముందుగానే సూచించారు. అయితే, సదరు కంపెనీ వివరాలు తెలియపరచలేదు. మీలో ఎవరైనా ఇలాంటి ఉద్యోగానికి సరితూగే వ్యక్తులుంటే.. కంపెనీ వివరాలు తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.