
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ భూ సేకరణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో సేకరించిన వ్యవసాయ భూముల యజమానులకు 6 వారాల్లోగా పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. అంతవరకు ఆ రైతులకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీ చేయించొద్దని చెప్పింది. చట్ట ప్రకారం రైతులకు పునర్నిర్మాణ, పునరావాస ప్రయోజనాలను కల్పించాలని సూచించింది. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణను సవాలు చేస్తూ సీహెచ్ లక్ష్మణ్ రెడ్డి మరో 20 మంది రైతులు 2018లో హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద విచారణను పూర్తిచేసి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున లాయర్ వాదిస్తూ.. ‘‘జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో రిజర్వాయర్ కోసం 69 ఎకరాలు, 257 ఎకరాల భూసేకరణ చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరి 1న, మే 16న వేర్వేరుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిని జారీ చేసే ముందు భూముల మార్కెట్ విలువలను సవరించలేదని రైతుల చేసిన వినతులను కలెక్టర్ పట్టించుకోలేదు. ప్రభుత్వ పాలసీల్లో తప్పులను ఎత్తిచూపిన రైతులకు బెదిరించారు. అవార్డు ప్రకటించే ముందు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పరిహారం పెంచాలన్న తమ అభ్యంతరాలను భూ సేకరణ అథారిటీకి పంపాలని కోరినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. నేటికీ ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండానే అధికారులు రైతుల భూముల్లో పనులు ప్రారంభించారు. పనులను పిటిషనర్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు’’అని వాదించారు. కాగా, పునరావాస పరిహారం చెల్లించామని అధికారులు కోర్టుకు చెప్పగా, ఎవిడెన్స్‌లు చూపాలని కోరింది. అయితే, ఎవిడెన్స్‌లు చూపకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సేకరించిన భూములకు పునరావాసం ప్రయోజనాలు కల్పించేదాకా భూములను ఖాళీ చేయించరాదని 2018లో ఇదే కోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. వాటిని అధికారులు ఉల్లంఘించడంతో కోర్టు ధిక్కరణ కింద ఇదే శిక్ష కూడా విధించామంది. ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని చెప్పింది. రైతులకు ఆరు వారాల్లోగా పునరావాస పరిహారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..విచారణను పూర్తి చేసింది.
భౌరంపేట ల్యాండ్స్ కబ్జాపై వివరణ ఇవ్వండి : రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్- జిల్లా దుండిగల్ -గండి మైసమ్మ మండలం భౌరంపేటలో కోట్లాది రూపాయల విలువైన పది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందనే పిల్‌పై హైకోర్టు స్పందించింది. ప్రైవేటు నిర్మాణ సంస్థ ఆక్రమణలకు సంబంధించిన అంశంతో పాటు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. భౌరంపేటలోని సర్వే నెం.166 లోని10 ఎకరాల ప్రభుత్వ భూమిని వజ్ర బిల్డర్లు కబ్జా చేసి అక్రమంగా లేఔట్ వేశారని సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జి. రఘువీర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. రఘురావు అనే వ్యక్తికి ఉన్న10 ఎకరాలకు సర్వే నెం. 166లో సబ్ నెంబర్లు వేసి సర్కార్ భూమిని కబ్జా చేశారని లాయర్ ఎం. ప్రతీక్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ ఆఫీసర్లు ఒక ఎమ్మెల్యేతో కుమ్మక్కై నిర్మాణ సంస్థ, ప్రైవేటు వ్యక్తులకు సహకరించారన్నారు. దీనిపై అదనపు ఏజీ స్పందిస్తూ.. 80 మంది పేరున ఆ ల్యాండ్ ఉన్నదని వాళ్లను ప్రతివాదులుగా చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు.