మెట్రో ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్​ పాటించరా?

మెట్రో ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్​ పాటించరా?

అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
నేడు అధికారులతో సమీక్ష.. తర్వాత మెట్రోలో జర్నీ

హైదరాబాద్, వెలుగు: జేబీఎస్  నుంచి ఎంజీబీఎస్  మెట్రో కారిడార్​ ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి మెట్రో అధికారులపై ఫైర్​ అయ్యారు. ప్రొటోకాల్​ఎందుకు పాటించలేదని నిలదీశారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్​ మెట్రో అధికారులతో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్​ మెట్రోలో కేంద్రం వాటాను మంత్రి వారికి గుర్తుచేశారు. దీనిపై శనివారం హైదరాబాద్​లో తాను నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష తర్వాత మెట్రో అధికారులతో కలిసి మంత్రి కిషన్​ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.

ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రయాణిస్తారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రోకు ఈ నెల 7న సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవంచేయగా, స్థానిక ఎంపీ అయిన కిషన్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విషయంలో అధికారులు ప్రొటో కాల్ పాటించలేదని బీజేపీ ఆరోపించింది. టీఆర్ఎస్ సర్కారు తమ నేతలను కావాలనే అవమానించిందని సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి నిరసనగానే శనివారం బీజేపీ మెట్రో జర్నీ నిర్వహించనుంది. ఈ ప్రయాణంలో.. మెట్రో ప్రాజెక్టులో కేంద్రం వాటా కూడా ఉందనే విషయాన్ని వారు ప్రయాణీకులకు వివరించనున్నారు.

మరిన్ని వార్తల కోసం