26 కులాలను బీసీ జాబితాలో కలపొద్దు: దాసు సురేశ్

26  కులాలను బీసీ జాబితాలో కలపొద్దు: దాసు సురేశ్

ఖైరతాబాద్, వెలుగు: బీసీ జాబితాలో కొత్తగా 26 కులాలను చేర్చడం అన్యాయమని బీసీ రాజ్యాధికార సమితి  కన్వీనర్  -దాసు సురేశ్  అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లలో, భవిష్యత్తులో తెలంగాణ బీసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కు ఆయన ఈ మేరకు నివేదిక సమర్పించారు. అనంతరం మీడియాతో దాసు సురేశ్ మాట్లాడారు. సామాజిక వెనుకబాటుకు గురవుతున్న నిజమైన పేదలకు బీసీ కేటగిరిలో అవకాశాలు కల్పించాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు చెప్పాయని ఆయన గుర్తు చేశారు. 

ఏం చేసినా బీసీలు సర్దుకుపోతారు, ప్రతిఘటించరనే ధోరణితో ప్రభుత్వం ముందుకెళ్లడం బీసీల ప్రయోజనాలను దెబ్బతీయడమే అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల ఒక బీసీ మంత్రిని బర్తరఫ్ చేసినా ఇప్పటివరకు ఆ స్థానాన్ని మరో బీసీతో నింపకపోవడం, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రేజర్వేషన్లను 34 శాతం నుంచి 21 శాతానికి తగ్గించడం, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ లలో బీసీల నాయకత్వాన్ని ఎనిమిదేళ్లుగా నిర్వీర్యం చేయడాన్ని బీసీలు ఏవిధంగా అర్థం చేసుకోవాలో సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు.