దేశమంటే గుజరాత్‌‌ ఒక్కటే కాదు

దేశమంటే గుజరాత్‌‌ ఒక్కటే కాదు
  • కేంద్రం అధికారాలన్నీ ఢిల్లీలో అట్టి పెట్టుకోవద్దు:కేటీఆర్
  • బాగా పనిచేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహమియ్యాలె
  • పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఆవిష్కరణలో మంత్రి

హైదరాబాద్‌‌, వెలుగు: రాజకీయాలతో సంబంధం లేకుండా బాగా పని చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. ఇండియా థర్డ్‌‌ వరల్డ్‌‌ కంట్రీగా మిగిలిపోవడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. కేంద్రం అధికారాలన్నీ ఢిల్లీలో అట్టి పెట్టుకోవద్దని, ప్రధాని కో ఆపరేటివ్‌‌ ఫెడరలిజానికి లోబడి పని చేయాలని చెప్పారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ప్రధాని, సీఎం దేశ ప్రగతి కోసం పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌‌లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ 2021–22 వార్షిక నివేదికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘దేశమంటే గుజరాత్‌‌ ఒక్కటే కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గుజరాత్‌‌కు గిఫ్ట్‌‌ సిటీ ఇచ్చుకోండి. కానీ అలాంటి గిఫ్ట్‌‌ సిటీలు మాకూ ఇవ్వాలి” అని అన్నారు. అమెరికా, చైనా, ఇండోనేషియా మాదిరిగా మన కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఎందుకు ప్రోత్సాహమివ్వదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రెండు, మూడు నెలలు మినహా మిగతా సమయాల్లో ఎకానమీకి తోడ్పాటునివ్వాలని, అప్పుడే దేశంలో ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి ఆరు ఇండస్ట్రియల్‌‌ కారిడార్లు ఇవ్వాలని స్వయంగా సీఎం కోరినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికే అడుగుతున్నామని, అంతే తప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ముందు భారతీయులమని, ఆ తర్వాత తెలుగు, తెలంగాణ వాళ్లమని తెలిపారు.

ప్రగతిలో వెనుకబడ్డాం
‘‘పారిశ్రామికంగా దేశం పురోగమిస్తోంది. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా సమస్య వస్తే దాని నుంచి సులువుగా ఎగ్జిట్‌‌ అయ్యే మార్గం కూడా ఉండాలి. ఇదే ఆలోచనతో సీఎం కేసీఆర్‌‌ హైదరాబాద్‌‌లో ఇంటర్నేషనల్‌‌ అర్బిట్రేషన్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేయిస్తే దానికి కేంద్రం ప్రోత్సాహం ఇవ్వలేదు’’ అని కేటీఆర్ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా మన ప్రగతిలో వెనుకబడిపోయామన్నారు.

2.32 లక్షల కోట్ల పెట్టుబడి.. 16 లక్షల జాబ్​లు
ఇండస్ట్రియలిస్టుల సూచనల నుంచే టీఎస్‌‌ఐపాస్‌‌ పాలసీ తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. ఐపాస్‌‌ ద్వారా 19,454 సంస్థలు రూ.2.32 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయని, వీటి ద్వారా 16 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఒకప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ పేరే ఎత్తేవారు కాదని, ఇప్పుడు తెలంగాణ పేరు లేకుండా పరిశ్రమల గురించే మాట్లాడటం లేదన్నారు.

నాలుగు సంస్థలతో ఎంవోయూ
రాష్ట్రంలో 4 సంస్థలు తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాయి. మ్యాన్‌‌కైండ్‌‌ ఆగ్రి ఫుడ్‌‌ రూ.159 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. 3ఎఫ్‌‌ ఇండస్ట్రీస్‌‌ 123 కోట్లు, రవిఫుడ్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ రూ.115 కోట్లు, యూఏఈ బేస్డ్‌‌ ఈవీ కంపెనీ మెటా 4  తమ యూనిట్‌‌ స్థాపించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

ఏడాదిలో రూ.17,867 కోట్ల పెట్టుబడులు
ఏడాదిలో రాష్ట్రానికి రూ.17,867 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ 2021 – 22 వార్షిక నివేదికలో వెల్లడించింది. టీఎస్‌‌ఐపాస్‌‌ ద్వారా 3,938 పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. వీటి ద్వారా కొత్తగా 96,863 ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. టీఎస్‌‌ఐఐసీ ఏడాదిలో కొత్తగా 13 ఇండస్ట్రియల్‌‌ పార్కులను అభివృద్ధి చేసిందన్నారు. 810 ఎకరాల భూమిని 526 పరిశ్రమలకు కేటాయించా మని పేర్కొన్నారు. లైఫ్‌‌ సైన్సెస్‌‌ ఫార్మా రంగాల్లో 215 కొత్త ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్రతిపాదనలు వచ్చాయ ని వివరించారు. రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఒక్కో ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్ స్థాపిస్తామని, ఇందుకోసం 10 వేల ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. ఏరోస్పేస్‌‌, డిఫెన్స్‌‌ రంగంలో కేంద్ర సివిల్‌‌ ఏవియేషన్‌‌ శాఖ నుంచి తెలంగాణ 3 బెస్ట్‌‌ అవార్డులు అందుకుందని ఆఫీసర్లు వెల్లడించారు. వెమ్‌‌ టెక్నాలజీస్‌‌ సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్‌‌ మిస్సైల్‌‌ కాంప్లెక్స్‌‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిందని, తద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు దక్కా యన్నారు. తెలంగాణ ఈవీ పాలసీతో ఇప్పటి వరకు రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.