
- ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా తండ్రీకొడుకు భేటీ
- ఏం మాట్లాడినా కాంగ్రెస్, బీజేపీకి చాన్స్ ఇచ్చినట్టవుతుందన్నగులాబీ బాస్
- కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనా డిస్కషన్!
- కవితను బుజ్జగిస్తరా.. మందలిస్తరా..? అని పార్టీ వర్గాల్లో చర్చ
- బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల 28న అమెరికాకు కేటీఆర్
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పార్టీ చీఫ్ కేసీఆర్ వద్దకు చేరింది. ఆమె రాసిన లేఖ... ఆ తర్వాత ఎయిర్ పోర్టు వద్ద చేసిన వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఆదివారం ఎర్రవల్లిలోని ఫామస్ కు వెళ్లిన కేటీఆర్... సుదీర్ఘంగా తన తండ్రి కేసీఆర్ తో చర్చించారు.
కవిత వ్యాఖ్యలపై, తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ తో చర్చించినట్టు తెలిసింది. అయితే, కవిత ఎపిసోడ్ పై ఎవరూ ఎక్కడ ఏమీ మాట్లాడొద్దని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీకి చాన్స్ ఇచ్చినట్టయిందని, మళ్ళీ అనవసరంగా ఏదేదో మాట్లాడితే ఆయా పార్టీలకు మరింత చాన్స్ ఇచ్చినట్టువుతుందని ఆయన అన్నట్లు తెలిసింది. ఈ ఎపిసోడ్ ను తానే డీల్ చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే అధి ష్ఠానం చూసుకుంటుందని చెప్పాలని కేటీఆర్ కు సూ చించినట్లు తెలిసింది. ఇలాంటి వాటిపై పెద్దగా దృష్టి పెట్టకుండా.. పార్టీ బలోపేతం పై దృష్టి సారించాల్సిందిగా సూచించారని తెలిసింది.
శుక్రవారం అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చిన కవిత.. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని. కోవర్టులను పక్కనపె డితేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. తాను తండ్రికి రాసిన లేఖ ఎలా బహిర్గతమైందని ప్రశ్నించారు. చెల్లి కామెంట్లకు కౌంటర్ అన్నట్టుగా పార్టీలో రేవంత్ కోవర్టులు ఉండి ఉండొచ్చంటూ శనివారం కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వాట్ నెక్స్ట్..!
కవిత ఎపిసోడ్ పై ఇప్పటివరకూ పార్టీ పెద్దలెవరూ నేరుగా స్పందించలేదు. మీడియా సమావేశంలో కేటీఆర్ రెండు మూడు ముక్కలు మాట్లాడినా.. కవిత పేరెత్తలేదు. ఈ క్రమంలోనే కవితతోనే కేసీఆర్ నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయని బీఆర్ఎఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆమెను బుజ్జగిస్తారా.. లేదంటే మందలిస్తారా.. అన్నదానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కవిత, కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. కేసీఆర్ ను కవిత కలిసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ, ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లి ఆ ఎపిసోడ్ పై కేసీఆర్ తో చర్చించారు. మరోవైపు పలువురు నేతలు కవిత అంశంపై స్పందిస్తూ.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనా..!
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషియల్ కమిషన్ కేసీఆర్..హరీశ్ రావుకు ఇటీవల నోటీసులు పంపింది. ఈ అంశమూ కేసీఆర్, కేటీఆర్ మధ్య చర్చకు వచ్చిన ట్టు సమాచారం. నోటీసులపై ఎలా స్పందించాలి... ఎలాంటి కార్యాచరణ అవలంబించాలి.. లీగల్ ఒపీనియన్ తదితర అంశాలను చర్చించుకున్నట్టు తెలిసింది.
జూన్ రెండో వారంలో సభ్యత్వ నమోదు
కవిత అంశంతో పాటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్, కేటీఆర్ చర్చించుకున్నట్లు సమాచారం. అమెరికాలో నిర్వహించనున్న బీఆర్ ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. జూన్ 1న నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న కేటీఆర్అక్కడికి వెళ్లనున్నారు. అక్కడ కేటీఆర్ మాట్లాడాల్సిన అంశాలపై, సభ తర్వాత ప్రవాసులతో నిర్వహించాల్సిన భేటీల గురించి కూడా కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం. జూన్ 2న తెలంగాణభవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలిసింది.
మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి జాతీయపతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. పార్టీ సభ్యత్వ నమోదుపైనా కేసీఆర్, కేటీఆర్ చర్చించినట్టు తెలిసింది. జూన్ రెండో వారంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు తదితర అంశాల షెడ్యూల్ పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి. సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్ కు సంబంధించిన వివరాలను కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం