- కొత్తూరు మండల సర్పంచుల సంఘం అల్టిమేటం
షాద్ నగర్, వెలుగు: పచ్చదనంతో కళకళలాడుతున్న సిద్ధాపూర్ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేలా ప్రతిపాదించిన ‘డంపింగ్ యార్డ్’ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని సర్పంచుల సంఘం కొత్తూరు మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ‘క్లీన్ విలేజ్ - గ్రీన్ విలేజ్’ అంటూనే సిద్ధాపూర్ను చెత్తను పారబోసే ప్రాంతంగా మార్చాలని చూస్తున్నారని ఫైరయ్యారు.
‘సేవ్ సిద్ధాపూర్’ నినాదంతో గ్రామంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించగా, సిద్దాపూర్తోపాటు పల్గూడం, కోడిచెర్లతోపాటు ఆయా తండాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు విషతుల్యమై, గాలి కలుషితమై రాబోయే తరాల భవిష్యత్తు నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే తమకు ఏ పదవీ ముఖ్యం కాదని స్పష్టం చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో తీవ్రస్థాయి ప్రజాపోరాటంతో పాటు తమ రాజీనామా పత్రాలను ప్రభుత్వానికి పంపుతామని హెచ్చరించారు.
