తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ నిషేధానికి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘ప్లాస్టిక్ రహిత మేడారం’ లక్ష్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ కవర్లతో కూడిన బఫే ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్లాస్టిక్ స్థానంలో విస్తారాకులను వినియోగించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ శ్రీ వినాయక గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన విస్తరాకులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గుడ్డతో తయారుచేసిన సంచులు, కాగితపు గ్లాస్‌లు వినియోగించాలని సూచించారు.
వనదేవతలకు చేసే పూజలతో పాటు అటవీ రక్షణను కూడా భక్తుల బాధ్యతగా భావించాలని చెప్పారు. అందరి సహకారంతోనే ప్లాస్టిక్ రహిత మేడారం సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి, జిల్లా సమాఖ్య మేనేజర్ కిషన్‌రావు పాల్గొన్నారు.
