ఆగష్టులోపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : కిషన్ రెడ్డి

ఆగష్టులోపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : కిషన్ రెడ్డి

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 లోపు 10 లక్షల మందికి  ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన రోజ్ గారి మేళాలో భాగంగా దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు తమ అపాయింట్‌మెంట్ లెటర్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో కేంద్ర  ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనుందని కిషన్ రెడ్డి  చెప్పారు. దేశంలో యువశక్తి  చాలా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు ఒక ఉద్యోగంలా కాకుండా సేవాభావంతో చేయాలని, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన రిక్రూటర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. 'రోజ్‌గార్ మేళా' మన సుపరిపాలనకు గుర్తింపుగా మారిందని మోడీ అన్నారు. తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తాము నిరంతరం ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని... మౌలిక సదుపాయాల అభివృద్ధితో అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.