
హిందూ మతంలో హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు ప్రతి పండుగకు ఏదో ఒక పూజ చేస్తాం.. వినాయకచవితికి గణపతిని.. దసరాకు.. దీపావళికి అమ్మవారిని ఇలా ప్రతి ఫెస్టివల్ వెనుక ఓ చరిత్ర ఉంది. ఆ పండుగ రోజుల్లో ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పండితులు చెబుతుంటారు. అలాగే హోలీ పండుగ రోజు కొన్ని ప్రత్యేక చర్యలు చేపడితే ఇంట్లో సంపద .. శ్రేయస్సు పెరుగుతుందని.. జాతకరీత్యా గ్రహ దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది ( 2025) హోలీ పండుగ రోజు ( మార్చి 14) ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం. . .
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో హోలీ పండుగ ఒకటి. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే రంగుల కేళి హోలీ. ఈ రోజున ఎక్కడ చూసినా రంగులు వర్షంగా కురుస్తూనే ఉంటాయి. అయితే హోలీ రోజున కొన్ని చర్యలు చేపడితే.. అవి ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరిగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.
ALSO READ | Holy 2025: హోలీ స్వీట్.. బెంగాలీ గుజియా స్వీట్ .. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా..!
హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ రోజున కొన్ని చర్యలు చేపడితే ఇంట్లో సంపద పెరుగుతుందని.. జాతకరీత్యా గ్రహ దోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రం ప్రకారం కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి.
ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని ( 2025, మార్చి 14) హోలీ పండగగా జరుపుకుంటారు. ఈ హోలీ హోలీ హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
హోలీ రోజున చేయాల్సిన పరిహారాలు
తులసి మొక్క:
తులసి మొక్కకు దాదాపు హిందువులు అందరూ పూజలు చేస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసముంటుందని పండితులు చెబుతున్నారు. హోలీ పండుగ.. కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి సరిగ్గా 15 రోజుల ముందు జరుపుకుంటాం.. కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా ఉండి.. జీవితం సంతోషంగా సాగాలని.. లక్ష్మీదేవి కటాక్షం కలగాలని.. హోలీ రోజున తులసి మొక్కను నాటాలని శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ 15 రోజుల్లో తులసి మొక్క నాటుకుపోతుంది. అందుకే హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఉదయించే సూర్యుని ఫోటో :
ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతుంటారు. సూర్య భగవానుడి కరుణ .. కటాక్షాలు లేకపోతే ఏపని కలిసి రాదు. అందుకే బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదిత్య హృదయం.. సూర్యాష్టకం పారాయణం చేయాలంటారు. ఇక హోలీ రోజున బ్రహ్మమహూర్తంలో ఇంట్లో.. తూర్పు వైపున ఉదయించే సూర్యుని చిత్ర పటాన్ని ఉంచి.. పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకరించాలి. ఆ తరువాత సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం పఠించాలి. చదవడం రాకపోతే.. ఓం శ్రీ సూర్యదేవాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఆ తరువాత సూర్యునికి పెరుగన్నం నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం కలుగుతుంది. అలాగే ఉదయించే సూర్యుని ఫొటోను ఆఫీసులో మీ టేబుల్ దగ్గర.. వ్యాపారస్థలంలో ఉంచితే పురోభివృద్ది కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీనివలన సూర్యభగవానుడి కరుణా.. కటాక్షాలు లభించి ఆర్థికంగా బలోపేతం అవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి ముందు వెండి నాణెం:
హిందువులందరి ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటం గాని.. విగ్రహం కాని ఉంటుంది. హోలీ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించండి. లక్ష్మీదేవి ఎదుట కొత్త చీర( రెండు జాకెట్ పీస్‌లు అయినా పరవాలేదు), జాకెట్పీస్ ఉంచి.. గాజులు... పసుపు.. కుంకుమ.. గంధంతో పూజించండి. వీటితో పాటుగా వెండి నాణాన్ని ఉంచండి. ఆ తరువాత వెండి నాణానికి కుంకుమతో పూజ చేస్తూ.. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. ఆ తరువాత ఒక ముత్తయిదువుకు ఆ చీర.. జాకెట్.. పసుపు.. కుంకుమ.. గంధం.. దక్షిణా.. తాంబూలం.. ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇక పూజ చేసిన వెండి నాణాన్ని ఇంట్లో డబ్బులు దాచే బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
రాధాకృష్ణల చిత్రం:
ఈ ఫొటోను ఇంట్లో బెడ్ రూంలో హోలీ రోజున ( మార్చి 14) ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ ఫొటోను బెడ్ రూంలో తూర్పుదిశలో ఉంచి.. అగర్బత్తీలు వెలగించాలి. స్వామి చిత్ర పటం దగ్గర మధుర పదార్థాలు ( స్వీట్స్) ఉంచాలి. ఆ తరువాత రోజున అంటే ఈ ఏడాది ( 2025) మార్చి 15 వాటిని ఆదంపతులు మాత్రమే తినాలి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లయిన వారే కాదు.. వైవాహిక జీవితంలో సమస్యలున్న వారు ( మనస్పర్దలు.. సంతాన సమస్యలు ఇంకా ఎలాంటి ఏసమస్య ఉన్నా) ఈ పరిహారాన్ని పాటిస్తే అంతా మంచే జరుగుతుందని వాస్తు నిపుణలు చెబుతున్నారు.