జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో బాల్క సుమన్, నిరంజన్ రెడ్డి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ అధికార మదంతో చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలని జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీకు ఒక్కటే చెప్పదలచుకున్నా.. మా నాయకుడు ఎన్నికల ప్రక్రియలో ‘‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’’ తీసుకురావాలనే ఆశయంతో ముందుకెళ్లి 20 లక్షలకు పైగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మీరు.. మీ సహచర నాయకుల్లాగా వందల కోట్లతో ప్రచార ఆర్భాటాలు, డబ్బు , మద్యం, బిర్యానీలు పంచి రాజకీయాలు చేయలేదన్నారు. మా ఓటమిలో కూడా నిజాయితీ ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకునే జ్ఘానం మీకు లేదన్నారు.

మీ నాయకులకు దమ్ము.. ధైర్యం ఉంటే ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో గెలిచి చూపించాలని తెలంగాణ జనసేన ఇంచార్జ్ గా సవాల్ చేస్తున్నానన్నారు. డబ్బులు పెట్టకుండా ఒక్క డివిజన్లో కూడా గెలవలేని మీరు.. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే.. జనసైనికులు అందరూ తిరగబడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మొన్న హైదరాబాద్ మహా నగరం వరదల్లో చిక్కుకుపోయి ప్రజలు అష్టకష్టాలు పడినప్పుడు మీరంతా ఎక్కడకు పోయారు. . ? అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో జీహెచ్ఎంసీ డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు బాగు చేయలేకపోయారు.. ఇప్పుడు పరోక్షంగా వరదలకు కారణం మీరు కాదా..? అని ప్రశ్నించారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ వరద సహాయం కోసం తన కష్టార్జితం నుంచి కోటి రూపాయలు, కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన బాల్క సుమన్, నిరంజన్ రెడ్డి ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఒక్క రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన మా నాయకుడు మాత్రం ప్రజల కోసం కోట్లు దాన చేస్తున్నారంటే ఎవరు నిజమైన నాయకుడో అర్థం అవుతుంది. వరద సహాయం కూడా ప్రజలకు అందించకుండా మీ తోటి నాయకులు దోచుకున్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు.

ఖబడ్దార్ బాల్క సుమన్.. మీ రాజకీయాలు ఏమైనా ఉంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చి మీకెంత దమ్ముందో నిరూపించుకోవాలని నేమూరి శంకర్ గౌడ్ సవాల్ చేశారు. అదేవిధంగా మరోసారి ఇష్టమొచ్చినట్లు నోరు జారితే మీ నాయకుల అసమర్ధత మొత్తం ప్రజల ముందు బయటపెడతాం అని  హెచ్చరించారు.

Read More news..

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్