
వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి 2023 మే 31 బుధవారం రోజున అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
ఇక వినాయక చవితి పండుగను తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు.
గతేడాది కూడా మట్టితో తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. ఇటీవలి కాలంలోనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే.