ప్లాస్మా థెర‌పీతో క‌రోనా త‌గ్గింది.. కానీ డాక్ట‌ర్ మృతి

ప్లాస్మా థెర‌పీతో క‌రోనా త‌గ్గింది.. కానీ డాక్ట‌ర్ మృతి

యూపీలో క‌రోనాతో బాధ‌ప‌డుతూ.. ప్లాస్మా థెర‌పీ పొందిన‌‌ డాక్ట‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించారు. ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయ‌న శ‌నివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. యూపీలో ప్లాస్మా థెర‌పీ అందించిన తొలి పేషెంట్ ఆయ‌నే. థెర‌పీ అందించిన త‌ర్వాత కోలుకుంటున్న ఆయ‌న స‌డ‌న్ గా మ‌ర‌ణించ‌డంతో ఉన్న‌ట్టుండి మ‌ర‌ణించార‌ని వైద్యులు తెలిపారు.

థెర‌పీ త‌ర్వాత క‌రోనా నెగ‌టివ్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఒరాయ్ సిటీకి చెందిన 58 ఏళ్ల‌ డాక్ట‌ర్, ఆయ‌న భార్య‌ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ (KGMU)లో వారిద్ద‌రికీ చికిత్స అందిచారు వైద్యులు. ఆయ‌న‌కు బీపీ, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌డంతో కండిష‌న్ సీరియ‌స్ అయింది. 14 రోజులుగా వెంటిలేట‌ర్ పై పెట్టి చికిత్స అందిస్తున్నారు KGMU వైద్యులు. లంగ్స్, లివ‌ర్ వంటి అవ‌య‌వాల ప‌నితీరు మంద‌గించింది. దీంతో ఆయ‌న‌కు ప్లాస్మా థెర‌పీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

అప్ప‌టికే కరోనా నుంచి కోలుకున్న వ్య‌క్తి నుంచి ప్లాస్మా సేక‌రించారు. యూపీలోనే తొలిసారి ఆయ‌న‌పైనే ఈ థెర‌పీ ప్ర‌యోగించారు. ప్లాస్మా ఎక్కించిన త‌ర్వాత ఆ డాక్ట‌ర్ నెమ్మ‌దిగా కోలుకున్నారు. లివ‌ర్ ప‌నితీరు మెరుగుప‌డింది. శ‌నివారం ఉద‌యం క‌రోనా టెస్టులో నెగ‌టివ్ వ‌చ్చింది. కానీ ఉన్న‌ట్టుండి యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ రావ‌డంతో కండిష‌న్ మళ్లీ క్రిటిక‌ల్ గా మారింది. ఆయ‌న‌కు డ‌యాల‌సిస్ కూడా చేయాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో స‌డ‌న్ గా హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. ఆయ‌న్ని కాపాడేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా లాభం లేక‌పోయింద‌ని, శ‌నివారం రాత్రి మ‌ర‌ణించార‌ని KGMU వైస్ చాన్సెల‌ర్ ఎంఎల్బీ భ‌ట్ చెప్పారు. అయితే ఆయ‌న భార్య అప్ప‌టికే పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన‌ట్లు తెలిపారు.

కాగా, క‌రోనాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి మందు లేదు. ప్లాస్మా థెర‌పీని కూడా ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపింది ఐసీఎంఆర్. దీనిని క్రిటిక‌ల్ గా ఉన్న పేషెంట్ల‌కు చివ‌రి అవ‌కాశంగా మాత్ర‌మే వాడాల‌ని సూచించింది.