బైక్​పై హాస్పిటల్​కు చిన్నారి.. ప్రాణాలు కాపాడిన డాక్టర్

బైక్​పై హాస్పిటల్​కు చిన్నారి.. ప్రాణాలు కాపాడిన డాక్టర్

ముంబై: డాక్టర్లను సాధారణంగా దేవుడు అంటారు. ఈ మాటను నిజం చేశాడు మహారాష్ట్రకు చెందని ఓ డాక్టర్. అప్పుడే పుట్టిన చిన్నారి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హాస్పిటల్​కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ కూడా లేకపోవడంతో బైక్ పైనే తీసుకుని హాస్పిటల్​కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని అలీబాగ్​ టౌన్​లో ఈ ఘటన జరిగింది.
అలీబాగ్​కు చెందిన శ్వేతా పటేల్​కు శుక్రవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో దగ్గరలోని ఓ హాస్పిటల్​కు ఆమె భర్త కేతన్​ తీసుకెళ్లాడు. వీరికి గతంలో ఓ బిడ్డ పుట్టినా కొద్ది గంటల్లోనే చనిపోయాడు. దీంతో సరైన సమయంలో సరైన ట్రీట్​మెంట్​ ఇవ్వకపోవడం ఎంతో కీలకంగా మారింది. ‘‘శ్వేత డయాబెటిక్ పేషెంట్. సుగర్​ లెవల్స్​ ను కంట్రోల్​ లో ఉంచుకునేందుకు ఆమె టైమ్​టు టైమ్​ మెడిసిన్స్​ వేసుకోవాలి”అని కేతన్​ చెప్పాడు. శ్వేత మెడికల్ హిస్టరీని దృష్టిలో పెట్టుకుని ఆమెకు మొదటిసారి డెలివరీ చేసిన గైనకాలజిస్టు.. పిడియాట్రిషన్​ డాక్టర్​ రాజేంద్ర చందోర్కర్​ను పిలిపించారు. ఆయన సహకారంతో డెలివరీ పూర్తి చేశారు. 3.1 కేజీల బరువుతో బాబు పుట్టాడు. అయితే ఒక్కసారిగా బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. అతడి శరీరం రంగు మారిపోతోంది. దీంతో వెంటనే అతడికి నియోనటల్​ కేర్​ అవసరమైంది. లాక్​డౌన్​ కారణంగా ఎటువంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందోర్కర్​ హాస్పిటల్​కు టూ వీలర్​పైనే తీసుకెళ్లారు. వెంటనే బేబీని అడ్మిట్​ చేసుకున్న డాక్టర్.. ట్రీట్​మెంట్​ మొదలుపెట్టారు. ఆక్సిజన్​ సపోర్ట్​ అందించారు. 12 గంటల తర్వాత అతడి పరిస్థితి నార్మల్​ అయ్యింది. ‘‘ఇది నాకు చాలా గొప్ప అనుభవం. ట్రీట్​మెంట్​ చేస్తుంటే ఆ బాబు నా వేళ్లు పట్టుకున్నాడు. అతడు సేఫ్​గా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా”అని డాక్టర్​ చందోర్కర్​ చెప్పారు.