ఆరోగ్యం విషయంలో డాక్టర్లు కూడా అశ్రద్ధే

ఆరోగ్యం విషయంలో డాక్టర్లు కూడా అశ్రద్ధే

డాక్టర్ దేవుడితో సమానమని అంటుంటారు. అలాంటి డాక్టర్లకి ఇప్పుడు ఓ కష్టం వచ్చి పడింది. తమ దగ్గరకు వచ్చే పేషంట్ల ఆరోగ్యాన్ని బాగు చేసే డాక్టర్లు..తమ హెల్త్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారట. డాక్టర్ల సగటు జీవిత కాలం తగ్గుతుండటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది

డాక్టర్..ఈ పేరు వినగానే మనకు తెలియకుండానే ఓ గౌరవం ఏర్పడుతుంది. తమ రోగాలను బాగు చేసే డాక్టర్ ను ప్రజలు దేవుడిలా భావిస్తారు. ఇంజినీరింగ్, MBA ఇలా మిగతా  డిగ్రీల కన్నా MBBS పట్టాకు ఉండే గౌరవం వేరు. ఇంటర్ నుంచి ప్రణాళికబద్ధంగా చదువుతూ హార్డ్ వర్క్ చేసినప్పుడే MMBS సీటు సాధ్యమవుతుంది. సూపర్ స్పెషలిస్టు డాక్టర్ గా ఎదగాలంటే 11యేళ్ళు కష్టపడాలి. MBBS ఐదున్నరేళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండేళ్లు, ఎండీ లేదా ఎంఎస్ చదవాలంటే మరో రెండేళ్లు చదువులతో కుస్తీ పట్టాలి. ఇది ఎంతో టెన్షన్ తో కూడుకున్న పనంటున్నారు డాక్టర్స్.

ఒక్కసారి బాధ్యతలు స్వీకరించాక కుటుంబానికి టైమ్ కేటాయింటే పరిస్థితి లేదంటున్నారు డాక్టర్స్. డ్యూటీలో నిమగ్నమైతే సరైన టైమ్ కు భోజనం చేసే పరిస్థితులు కూడా ఉండవని చెబుతున్నారు. దీంతో బీపీ, షుగర్, అల్సర్ లాంటి రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. దీంతో పాటు గుండె జబ్బులు కూడా పెరుగుతున్నాయంటున్నారు.  డాక్టర్ల  సగటు ఆయు:ప్రమాణం 59 ఏళ్లే అని ఇటీవలి సర్వేలో వెల్లడైందంటున్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ల ప్రాణాలు రిస్క్ లో ఉండటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిమ్స్ హస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మీరా కుమారి లండన్ లో అకస్మాత్తుగా చనిపోవడం తట్టుకోలేకపోతున్నామంటున్నారు డాక్టర్స్. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, చిన్నవయస్సులోనే డాక్టర్లు చనిపోతున్నారని  చెప్తున్నారు.

రెసిడెంటల్ డాక్టర్ గా రోజు 12 గంటలు పని చేయడంతో సరైన విశ్రాంతి లేక ఆరోగ్యం పాడైతుందంటున్నారు డాక్టర్స్. రోజు రోజుకు పేషంట్ల సంఖ్య పెరుగుతుండటంతో తమపై ఒత్తిడి ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. వారానికి 48 గంటలు మాత్రమే డాక్టర్స్ విధులు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు సూచనలను అమలు చేయాలని కోరుతున్నారు. తమిళనాడులో డాక్టర్లకు షిఫ్ట్ విధానం అమలు చేస్తున్నారనీ…  రాష్ట్రంలోనూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రస్తుత జీవన విధానంతో ఆరోగ్యానికి ముప్పు ఉందంటున్నారు యోగా గురువులు. టెన్షన్ తో రోగాలు రాకుండా యోగా పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. ఆసనాలు, ప్రాణాయామంతో పాటు మెడిటేషన్ చేస్తే టెన్షన్ నుంచి రిలీఫ్ పొందవచ్చని చెప్తున్నారు.

డాక్టర్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న IMA సభ్యులు… వారు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.