- పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
తాండూరు, వెలుగు: తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో డాక్టర్ల నిర్లక్ష్యం.. ఓ బాలింత ప్రాణాల మీదకు తెచ్చింది. కాన్పు సమయంలో కడుపులో కాటన్ మరచిపోయి కుట్లు వేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ గ్రామానికి చెందిన ఆర్తి(19) అనే గర్భిణి తన మొదటి కాన్పు కోసం ఈ నెల 3న తాండూరులోని ఎంసీహెచ్‌లో చేరగా, ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది.
అయితే, కాన్పు సమయంలో ఎపిసియోటమీ చేసిన డాక్టర్లు.. కుట్లు వేసే క్రమంలో దూదిని లోపలే మరచిపోయి కుట్లు వేశారు. ఐదు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయడంతో ఆర్తి కర్నాటకలోని తన తల్లిగారింటికి వెళ్లింది. అక్కడ ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చూపించారు. పరీక్షించిన డాక్టర్లు కుట్లు విప్పి చూడగా, లోపల కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కాటన్‌ను గుర్తించి బయటకు తీశారు.
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు గురువారం తిరిగి మాతా శిశు ఆసుపత్రికి రాగా, ఇక్కడి డాక్టర్లు రెండు రోజుల్లో నయమవుతుందని నమ్మబలికారు. కానీ ఆర్తి పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని చెప్పి చేతులెత్తేశారు. ఎంసీహెచ్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిందని భర్త రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా, దూది మరిచిపోయి కుట్లు వేసిన మాట వాస్తవమేనని ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అనిల్ అంగీకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
