
ఫ్రెండ్స్ చేసిన తిక్కచేష్టలకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్లు సరైన టైమ్ లో ఆపరేషన్ చేయడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ప్రాణం పోయేది. కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడికి సర్జరీ చేసి, ప్రాణం పోశారు వైద్యులు. బాధిత యువకుడు ఆస్పత్రిలో చేరడానికి కారణమైన కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
అసలేం జరిగింది...?
నేపాల్ లోని రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి యువకుడు వారం రోజుల నుంచి కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రమై.. ఆరోగ్యం క్షిణించడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అన్ని పరీక్షలు చేశారు. డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్‌లు చేసి.. కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు.
వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స చేసి, కడుపులోంచి మద్యం బాటిల్‌ను బయటకు తీశారు. దాదాపు రెండున్నర గంటల సమయం ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న వొడ్కా బాటిల్ ను బయటకు తీశారు. కడుపులో మద్యం సీసా ఉండడం వల్ల పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమించిందని ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.
ఆపరేషన్ సమయంలో మన్సూరి కడుపు నుంచి బాటిల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నూర్సాద్ మన్సూరి... తన స్నేహితులతో కలిసి మద్యం తాగిన సమయంలో వొడ్కా బాటిల్ ను ప్రైవేటు పార్ట్ ద్వారా లోపలికి జొప్పించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన నూర్సాద్ మన్సూరి స్నేహితుడు షేక్ సమీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు చంద్రపూర్ పోలీసులు.