సీరియస్ కండీషన్ తర్వాత ఆస్పత్రికి వస్తున్న జనం

సీరియస్ కండీషన్ తర్వాత ఆస్పత్రికి వస్తున్న జనం
  • ఈ ఆలస్యమే ప్రాణాల మీదకు తెస్తున్నది
  • కరోనా సోకిన తర్వాత రెండో వారమే చాలా కీలకం
  • ఆక్సీజన్ లెవల్స్ 95% కంటే తగ్గితే హాస్పిటల్ కు పోవాల్సిందే
  • లేట్ గా వస్తే రెమ్డిసివిర్  కూడా ప్రభావం చూపట్లేదు

మొన్నటివరకు కరోనా వస్తే హడలిపోయి హాస్పిటళ్లకు పరుగెత్తిన జనం ఇప్పుడు  లైట్ తీసుకుంటున్నారు. దమ్ము పెరిగి, కండీషన్ సీరియస్  అయితేనే  హాస్పిటళ్లకు వస్తున్నారని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం దవాఖాన్లలో సీరియస్ కండీషన్లో ఉన్నవాళ్లలో సగం మంది ఇలా లేట్గా వచ్చినవాళ్లేనని వారు చెప్తున్నారు. ఈ ఆలస్యం వల్ల నాలుగైదు రోజుల్లో కోలుకోవాల్సిన వాళ్లు కూడా పది ఇరవై రోజులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. కొంతమందైతే చాలా సీరియస్ కండీషన్లో హాస్పిటల్కు వచ్చి, ఒకట్రెండు రోజుల్లోనే మరణిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. కరోనా వల్ల తొలుత రక్తంలో ఆక్సిజన్  లెవల్స్ తగ్గి, ఆ  తర్వాత లంగ్స్పై ఎఫెక్ట్ పడడం వల్ల లోపల జరిగే పరిణామాలు పేషెంట్కు తెలియడం లేదని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిన విషయం ఆక్సిజన్  సాచ్యురేషన్ చెక్ చేసుకుంటే తప్ప పేషెంట్కు తెలిసే పరిస్థితి ఉండదు. ఈ కండీషన్నే ‘హ్యాపీ హైపాగ్జిమియా’ అంటారు. హ్యాపీ హైపాగ్జిమియా ఉన్నవాళ్లలో దమ్ము కూడా రాదు. దీంతో తమకు ఇబ్బంది ఉన్నట్టు కూడా పేషెంట్లకు  తెలియదు.ఆక్సిజన్ లెవల్స్ బాగా పడిపోయి, లంగ్స్లో ఇబ్బందులు ఏర్పడ్డాకే దమ్ము స్టార్ట్ అవుతుంది. కరోనా పేషెంట్లు ఆలస్యంగా హాస్పిటళ్లకు రావడానికి ఇది కూడా ఓ కారణమేనని డాక్టర్ రాజారావు వివరించారు. ఆక్సిజన్ సాచురేషన్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

కరోనా సోకిన తర్వాత రెండో వారం కీలకం

కరోనా పేషెంట్లలో రెండో వారం చాలా కీలకమని డాక్టర్లు చెప్తున్నారు. సింప్టమ్స్ వచ్చిన ఆరేడు రోజుల తర్వాతే ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, దమ్ము రావడం వంటి లక్షణాలు స్టార్ట్ అవుతాయంటున్నారు. ఈ సమయంలో వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కానీ, ఇలాంటి సింప్టమ్స్ మొదలయ్యాక కూడా చాలా మంది హాస్పిటళ్లకు రావడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకో రెండు రోజులు చూద్దాంలే అని ఎదురు చూడడం, తమకు తెలిసిన మందులు వాడడం వంటివి చేస్తున్నారని, కండీషన్ సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కు వస్తున్నారని  డాక్టర్ రాజారావు అన్నారు. 

లేట్గా వస్తే రెమ్డెసివిర్తో కూడా మార్పు రాదు

కరోనా ట్రీట్మెంట్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్ను ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఇంజక్షన్తో పూర్తిగా కోలుకుంటారని ఇప్పటి వరకు రుజువు కాలేదు. కానీ, ఎంతో కొంత ప్రయోజనమైతే ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. కండీషన్ సీరియస్ అయ్యాక హాస్పిటల్కు వచ్చే వాళ్ల విషయంలో రెమ్డెసివిర్తో కూడా పెద్దగా మార్పు రావడం లేదని క్రిటికల్ కేర్  ఎక్స్పర్ట్  డాక్టర్ మాదాల కిరణ్ అన్నారు. సింప్టమ్స్ వచ్చిన వారం, పది రోజుల లోపలే రెమ్డెసివిర్  స్టార్ట్ చేస్తే ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటోందని ఆయన చెప్పారు. పది రోజుల తర్వాత స్టార్ట్ చేస్తే ఆశించిన ప్రయోజనం ఉండడం లేదన్నారు. 

ఆక్సిమీటర్ మెయింటెయిన్ చేయాలి

ప్రస్తుతం మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్లు అసలు హాస్పిటళ్లకు రావడం లేదు. కొంత మంది ఆక్సిజన్ లెవల్స్ 90 కంటే తగ్గి, దమ్ము విపరీతంగా వచ్చాక ఆస్పత్రిలో చేరుతున్నారు. అప్పటికే వాళ్లలో యాంగ్జైటీ పెరిగిపోయి, వెంటిలేటర్ స్టేజ్కెళ్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న మరణాల్లో కూడా ఇలాంటి కేసులే ఉంటున్నాయి. ముందే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నోళ్లు కచ్చితంగా రీకవర్  అవుతు న్నారు. కరోనా సోకినవాళ్లు కచ్చితంగా ఆక్సిమీటర్ మెయింటెయిన్ చేయాలి. ఆక్సిజన్ లెవల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. 95% కంటే ఆక్సిజన్ లెవల్స్ తగ్గినా, దమ్ము వచ్చినా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. 
                                                     - డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్  ఎక్స్ పర్ట్, నిజామాబాద్