ఆర్‌‌‌‌ఎంపీలకు ట్రైనింగ్ ఇస్తే సర్వీసులు బంద్ పెడ్తం.. రాష్ట్ర సర్కార్‌‌‌‌కు డాక్టర్ల హెచ్చరిక

ఆర్‌‌‌‌ఎంపీలకు ట్రైనింగ్ ఇస్తే సర్వీసులు బంద్ పెడ్తం.. రాష్ట్ర సర్కార్‌‌‌‌కు డాక్టర్ల హెచ్చరిక
  • రాష్ట్ర సర్కార్‌‌‌‌కు డాక్టర్ల హెచ్చరిక
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్‌‌‌‌ఎంపీలకు ట్రైనింగ్, సర్టిఫికెట్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే సర్వీసులు ఆపేస్తామని డాక్టర్లు హెచ్చరించారు. మెడిసిన్‌‌లో ఏబీసీడీలు కూడా చదవని వ్యక్తులకు, డాక్టర్లుగా చలామణి అయ్యేందుకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 

ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌‌‌‌కు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ గురువారం లేఖ రాసింది. ఆర్‌‌‌‌ఎంపీల విషయంలో ప్రభత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఇదేం పద్ధతి...

డాక్టర్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ కోసం మెడికల్ కౌన్సిల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచే కౌన్సిల్ వద్ద రెన్యువల్ కోసం డాక్టర్లు క్యూ కట్టారు. రైతులు యూరియా కోసం చెప్పులు లైన్‌‌లో పెట్టినట్లు తమ రిజిస్ట్రేషన్ పేపర్లను లైన్‌‌లో పెట్టి నిరసన తెలిపారు. రోజూ కొంత మందికే టోకెన్లు ఇచ్చి, మిగిలిన వాళ్లను వెనక్కి పంపిస్తున్నారన్నారు. 

డాక్టర్ల నిరసనపై మీడియాలో పెద్దఎత్తున కవరేజ్ రావడంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్, అధికారులపై హెల్త్‌‌ మినిస్టర్ హరీశ్‌‌ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో స్పందించిన కౌన్సిల్ పెద్దలు.. ఇకపై టోకెన్ సిస్టమ్ ఉండదని, వచ్చినోళ్లందరికీ రెన్యువల్ చేసి పంపిస్తామన్నారు. సోమవారం నుంచి ఆన్‌‌లైన్‌‌లోనే రెన్యువల్ చేసుకునేందుకు వెబ్‌‌సైట్‌‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.