కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ
  • త్రీడీ గ్రాఫిక్స్​తో రూపొందించినం: మంత్రి తలసాని
  • 17న కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా జలవిహార్​లో ప్రదర్శిస్తం
  • బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేసిన చీర సమర్పిస్తం
  • మృత్యుంజయ హోమం చేయిస్తం
  • పార్శీ గుట్ట మైసమ్మకు బంగారు కవచం ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ జీవిత చరిత్రపై బాహుబలి రేంజ్​లో త్రీడీ గ్రాఫిక్స్​తో డాక్యుమెంటరీని రూపొందించామని.. కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న దానిని విడుదల చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ చెప్పారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో నిర్వహించే కేసీఆర్​ పుట్టినరోజు వేడుకల్లో దానిని ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ టీజర్​ను తలసాని సోమవారం విడుదల చేశారు. కేసీఆర్​ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని వివరిస్తూ 30 నిమిషాల త్రీడీ డాక్యుమెంటరీని రూపొందించామని చెప్పారు. దీనితోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను కూడా జన్మదిన వేడుకల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.

హోమాలు, ప్రత్యేక పూజలు

కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తలసాని వివరించారు. దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎమ్మెల్సీ కవితతో కలిసి బల్కంపేట అమ్మవారికి సమర్పించనున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, ప్రత్యేక పూజలు చేయిస్తున్నామన్నారు. పార్సీగుట్టలోని బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి బంగారు కవచం అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని.. సికింద్రాబాద్ గణేశ్​ ఆలయంలో గణపతి కల్యాణం చేయిస్తామని తెలిపారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. నాంపల్లిలోని యూసెఫిన్ దర్గాలో చాదర్ సమర్పణ, గురుద్వారాలో గురుగ్రంథ్​ సాహెబ్ కు ప్రత్యేక పూజలు, మహిళలకు చీరల పంపిణీ, గాంధీ హాస్పిటల్​లో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు. జలవిహార్​లో జరిగే కేసీఆర్​ జన్మదిన వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్​ నేతలు పాల్గొంటారని తెలిపారు.

For More News..

ఆందోళనలో పాల్గొన్నాడని బీజేపీ లీడర్​ ఇల్లు కూల్చివేత

జీవోలు ఇచ్చి.. చెత్తబుట్టలో వేస్తరా?